Share News

ప్రతీ పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:30 PM

అర్హత ఉన్న ప్రతీ పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. బుధవారం గోదావరిఖనిలో ఓటు హక్కు పరిరక్షణ, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలుగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ప్రతీ పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాలి

కోల్‌సిటీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతీ పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. బుధవారం గోదావరిఖనిలో ఓటు హక్కు పరిరక్షణ, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలుగకుండా చూడాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని చౌరస్తా నుంచి మున్సిపల్‌ టీజంక్షన్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్‌ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఓట్ల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించవద్దని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో చోటు చేసుకుంటున్న మార్పులు, తొలగింపులపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అర్హులైన ఓటర్లను తొలగిస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు మాట్లాడుతూ ఓటు హక్కు కేవలం ఎన్నికల్లో పాల్గొనే హక్కు మాత్రమే కాదని, అది ప్రతీ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక, ప్రజాస్వామ్య హక్కు అన్నారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిస్పక్షపాతం, జవాబుదారితనం ఉండాలని, ఓటర్ల జాబిత సవరణ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సర్‌ ప్రక్రియపై తలెత్తిన అనుమానాలు, అభ్యంతరాలు, ఓటర్ల హక్కుల పరిరక్షణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రామగుండం నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ ముస్తాఫా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేయర్‌ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం) న్యూడెమోక్రసీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 11:30 PM