Share News

పున్నమి పోయినా.. ఏరువాక సాగలే

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:38 AM

ఏరువాక పౌర్ణమి పోయినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. మృగశిర కార్తెతో దుక్కులు దున్ని నార్లు పోసి ఆరుద్ర కార్తెతో రైతన్నలు ఏరువాక సాగేందుకు పున్నమి కోసం ఎదురుచూస్తుంటారు. మృగశిర, ఆరుద్ర పోయి ఏరువాక పౌర్ణమి గడిచినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు.

పున్నమి పోయినా.. ఏరువాక సాగలే

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఏరువాక పౌర్ణమి పోయినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. మృగశిర కార్తెతో దుక్కులు దున్ని నార్లు పోసి ఆరుద్ర కార్తెతో రైతన్నలు ఏరువాక సాగేందుకు పున్నమి కోసం ఎదురుచూస్తుంటారు. మృగశిర, ఆరుద్ర పోయి ఏరువాక పౌర్ణమి గడిచినా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అదిగో వర్షం... ఇదిగో వర్షం అంటూ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నా మబ్బులు వచ్చినట్టే వచ్చి ముఖం చాటేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాక జూన్‌తో ప్రారంభమై సెప్టెంబరు మాసాంతంతో ముగుస్తుంది. సాధారణంగా జూన్‌ 1 వరకు కేరళ తీరాన్ని తాకే నైరుతి రుతుపవనాలు నాలుగైదురోజుల్లో రాష్ట్రమంతా విస్తరించి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం నెలకొన్నది. రుతుపవనాలు 15 రోజుల క్రితమే రాష్ట్రమంతటా వ్యాపించినా వర్షాలు కురవడం లేదు.

ఎనిమిది రోజులే వర్షాలు..

నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్‌లో జిల్లాలో సగటున 124.5, జూలైలో 238, ఆగస్టులో 203.6, సెప్టెంబరులో 167.1 మిల్లీమీటర్లు, మొత్తంగా సీజన్‌ నాలుగు నెలల్లో 733.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. జూన్‌ మంగళవారంతో ముగియనుండగా నెలరోజుల్లో ఎనిమిది రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. ఈనెల 27న సాయంత్రం, రాత్రి కురిసిన వాన దాదాపుగా జిల్లాలో సగానికి పైగా మండలాల్లో మంచి వర్షపాతాన్ని నమోదు చేసింది. ఆ ఒక్క రోజే జిల్లాలో 18.4 మిల్లీమీటర్ల సగటువర్షపాతం నమోదైంది. ఆరోజు రామడుగులో 69.4, కరీంనగర్‌ రూరల్‌లో 61.5, గంగాధరలో 37.6, చొప్పదండిలో 29.1, వీణవంకలో 23, మానకొండూర్‌లో 22.4, కరీంనగర్‌ అర్బన్‌లో 16.4, శంకరపట్నంలో 9.9, గన్నేరువరంలో 9.1, ఇల్లందకుంటలో 4.5, సైదాపూర్‌లో 5, కొత్తపల్లిలో 3.2, తిమ్మాపూర్‌లో 1.8, మిగతా మండలాల్లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లో కొంత సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతవరణశాఖ పేర్కొంటున్నా సాగుకు అనుకూల పరిస్థితులు లేవు.

35 శాతం లోటు

జిల్లావ్యాప్తంగా జూన్‌ మాసంలో 124.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. 28 వరకు 115.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 74.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలో జూన్‌లో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈనెలలో కురిసిన వర్షంలో 18.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం ఈనెల 27న నమోదైంది. మిగతా అన్ని రోజుల్లో ఆరు రోజులు మాత్రమే వర్షం కురవగా 56 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణశాఖ లెక్కల ప్రకారం గంగాధర, రామడుగు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. జూన్‌లో గంగాధర మండల సాధారణ వర్షపాతం 110.3 మిల్లీమీటర్లు కాగా 132.1 మిల్లీమీటర్లు, రామడుగు మండల సాధారణ వర్షపాతం 106.3 కాగా 150.3 మిల్లీమీటర్లు నమోదైంది.

ఐదు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

చిగురుమామిడి, తిమ్మాపూర్‌, కొత్తపల్లి, గన్నేరువరం, సైదాపూర్‌ మండలాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉన్నాయి. శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, చొప్పదండి, కరీంనగర్‌ రూరల్‌ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. తీవ్ర వర్షభావ పరిస్థితి ఉన్న మండలాల్లో 60 నుంచి 78 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావ మండలాల్లో 23 నుంచి 51 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌ అర్బన్‌ మండలంలో సాధారణ వర్షపాతం 125.1 మిల్లీమీటర్లకు 104 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మానకొండూర్‌ మండలంలో 107.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 91.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణశాఖ లెక్కల ప్రకారం మైనస్‌ 19 నుంచి ప్లస్‌ 19 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. కరీంనగర్‌, మానకొండూర్‌ మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంటున్నా కరీంనగర్‌ మండలంలో 17 శాతం, మానకొండూర్‌ మండలంలో 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల వర్షాకాలంలో ఒక నెల గడిచిపోవడంతో రైతుల్లో వానాకాలం సాగుపై తీవ్ర ఆందోళన మొదలైంది. మరో 15 రోజులు గడిస్తే అటు పత్తి, ఇటు వరి సాగు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. జిల్లాలో 2,79,000 ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో పత్తి సాగుచేస్తారు. దీంతో 3.29 లక్షల ఎకరాల్లో వర్షకాలం సాగుపై ఆందోళన నెలకొన్నది. మూడు లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ సాగు చేసే అవకాశం లేనందువల్ల వర్షాలు పడని పరిస్థితుల్లో తెలంగాణ ధాన్యాగారంగా పేరున్న కరీంనగర్‌ జిల్లాలో కరువు నెలకొనే పరిస్థితులు రానున్నాయని కలవరపడుతున్నారు.

సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైన మండలాలు:

- గంగాధర (110.3 మిల్లీమీటర్లకు 132.1)

- రామడుగు (106.3 మిల్లీమీటర్లకు 150.3)

తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న మండలాలు: (60 నుంచి 78 శాతం తక్కువ వర్షపాతం)

చిగురుమామిడి, తిమ్మాపూర్‌, కొత్తపల్లి, గన్నేరువరం, సైదాపూర్‌

వర్షాభావ పరిస్థితులు ఉన్న మండలాలు: (23 నుంచి 51 శాతం తక్కువ వర్షపాతం)

శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, చొప్పదండి, కరీంనగర్‌ రూరల్‌

ఫ సాధారణ వర్షపాత ఉన్న మండలాలు: (మైనస్‌ 19 నుంచి ప్లస్‌ 19 మిల్లీమీటర్ల వర్షపాతం)

- మానకొండూర్‌ (107.3 మిల్లీమీటర్లకు 91.5)

- కరీంనగర్‌ అర్బన్‌ (125.1 మిల్లీమీటర్లకు 104)

Updated Date - Jun 30 , 2026 | 12:38 AM