Share News

అతివల ఆరోగ్యానికి భరోసా

ABN , Publish Date - Mar 15 , 2026 | 01:10 AM

మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళా సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. అనంతరం డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది.

అతివల ఆరోగ్యానికి భరోసా

జగిత్యాల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళా సభ్యులకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించాలని నిర్ణయించింది. అనంతరం డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం, మెప్మాల ఆధ్వర్యంలో గల స్వయం సహాయక సంఘాల్లో 2,31,466 మంది సభ్యులున్నారు. వీరంతా సెర్ప్‌, డీఆర్‌డీవో, మెప్మా శాఖల ఆధ్వర్యంలో స్త్రీ నిధితో పాటు పావలా వడ్డీ తదితర రుణాలు పొంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సభ్యులందరికీ ఉచితంగా 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్‌ హెల్త్‌కార్డులు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆయా మండలాల్లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఏరియా ఆస్పత్రుల్లో రక్త నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపించనుంది. ఈ పరీక్షల్లో వ్యాధులు ఉన్నట్లు తేలితే వారికి వెంటనే చికిత్స సైతం అందిస్తారు.

జిల్లాలో ఐదు ఆసుపత్రుల గుర్తింపు

జిల్లాలో వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో గల మూడు ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని రెండు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలను గుర్తించారు. కోరుట్ల, రాయికల్‌, ధర్మపురి, జగ్గసాగర్‌, మేడిపల్లి ఆసుపత్రుల్లో పైలట్‌ ప్రాజెక్టుగా గుర్తించారు. ముందుగా ఈ ఆసుపత్రుల పరిధిలోని ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతీ రోజు ఒక్కో కేంద్రంలో 50 మంది మహిళలకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

మహిళలకు అందించే వైద్య పరీక్షలు

జిల్లాలో ప్రజాపాలన వైద్య శిభిరంలో సాదారణ వైద్య పరీక్షలతో పాటు వివిధ రకాల 32 వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా బ్లడ్‌ షుగర్‌, ఎస్‌జీపీటీ, ఎస్‌జీఓటీ, ఎస్‌ టోటల్‌ ప్రొటీన్‌, టీఎస్‌హెచ్‌, హెమోగ్లోబిన్‌, ప్లేట్‌లెట్‌ కౌంట్‌, టోటల్‌ రెడ్‌ బ్లడ్‌ సెల్‌ కౌంట్‌, హెచ్‌సీటీ, ఎంసీవీ, బ్లడ్‌ గ్రూపింగ్‌, వెయిట్‌, బీఎంఐ, బీపీ, డిజాబిలిటీ, టెంపరేచర్‌, హార్ట్‌ రేట్‌, కంటి పరీక్ష వంటి తదితర పరీక్షలు జరపనున్నారు.

మండల స్థాయిలో అధికార బృందాల ఏర్పాటు

మండల బృందంలో మెడికల్‌ ఆఫీసర్‌, స్టాప్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నిషియన్‌, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపు వీఓలు ఉంటారు. అదేవిధంగా జిల్లా స్థాయి బృందంలో డీఎంహెచ్‌వో, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెంండెంట్‌, టీ హబ్‌ ఇన్‌చార్జి, డీఆర్‌డీఏ పీడీ, ల్యాబ్‌ హెడ్‌, ల్యాబ్‌ మేనేజర్‌లు ఉంటారు.

ఫకార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ వైద్యం

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగానే ఎస్‌హెచ్‌జీ సభ్యులకు వైద్య పరీక్షలు చేసి ఆరోగ్య డిజిటల్‌ కార్డులు అందించేందుకు సిద్ధమైంది. ఈ కార్డులతో మహిళలకు ఆరోగ్య భద్రత లభించనుంది. ఏదేని జబ్బు చేస్తే కార్డు తీసుకుని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చూపించినా ఉచితంగా వైద్యం అందుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

రెండు. మూడు రోజుల్లో షెడ్యూల్‌...

-సుజాత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

ఎస్‌హెచ్‌జీ మహిళా సభ్యులకు 32 రకాల వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం మహిళలకు అవసరమైన వైద్యాన్ని అందించనున్నాం. కాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ మరో రెండు, మూడు రోజుల్లో రానుంది. షెడ్యూల్‌ వచ్చిన వెంటనే ప్రతి మండలంలో రోజుకు 50 నుంచి 100 మంది చొప్పున ఎస్‌హెచ్‌జీ సభ్యుల రక్త నమూనాలు సేకరిస్తాం.

జిల్లా వివరాలు ఇలా..

---------------------------------

మొత్తం మండలాలు...20

స్వయం సహాయక మహిళా సంఘాలు..14,964

సభ్యులు...1,73,412

గ్రామైఖ్య మహిళా సంఘాలు..565

మండల సమాఖ్య సంఘాలు...18

జిల్లా సమాఖ్య సంఘం...1

----------------------------------

మొత్తం మున్సిపాలిటీలు...5

మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లు...173

పట్టణ మహిళా సమాఖ్య సంఘాలు..5

స్వయం సహాయక మహిళా సంఘాలు..5,361

మహిళా సంఘాల్లో సభ్యుల సంఖ్య....58,076

--------------------------------------

Updated Date - Mar 15 , 2026 | 01:10 AM