ప్రతిభావంతులను ప్రోత్సహించడం ప్రశంసనీయం
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:42 PM
కోల్‌బెల్ట్ ప్రాంతంలో పలు రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్న తారా ఆర్ట్స్ అకాడమీ సేవలను పలువురు ప్రశంసించారు. హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదావరిఖనిలోని ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఉగాది కళోత్సవాలలో నల్లవజ్రం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
కోల్‌సిటీటౌన్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కోల్‌బెల్ట్ ప్రాంతంలో పలు రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్న తారా ఆర్ట్స్ అకాడమీ సేవలను పలువురు ప్రశంసించారు. హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదావరిఖనిలోని ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఉగాది కళోత్సవాలలో నల్లవజ్రం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఎన్‌సీపీ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ మేకల శ్రీధర్‌యాదవ్, సాంస్కృతిక సారధి రాష్ట్ర బాధ్యులు అంతడుపుల నాగరాజు మాట్లాడారు. వివిధ రంగాలలో విశేష సేవలందిస్తున్న వారు వారి సేవలకు గుర్తింపుగా ప్రశంస కోరుకోవడం సహజమని, కోల్‌బెల్ట్ విస్తరించి ఉన్న ప్రాంతాలలో సింగరేణి సంస్థతో అనుబంధం ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులు, పాత్రికేయులు, వైద్యులు తదితర రంగాల వారికి అవార్డులు అందజేయడం అభినందనీయమన్నారు.
తారా ఆర్ట్స్ అకాడమి గోదావరిఖని వేదికగా మూడు సంవత్సరాలుగా నల్లవజ్రం, ఉగాది పురస్కారాలు అందిస్తుందన్నారు. అనంతరం పలు రంగాలకు చెందిన ఈద రాంచందర్, పందిల్ల శ్యాంసుందర్, డాక్టర్ జి.రమేష్‌బాబు, శ్రీనిధి, జి.మోహన్, బోడకుంట వెంకటరాజం, తిప్పబత్తిని అంజయ్య, గంధం శ్రీనివాస్, కొమ్ము అశోక్ తదితరులకు నల్లవజ్రం, ఉగాది పురస్కారాలను అందజేశారు. సినీ సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ సంగీత విభావరి, కళాకారుల నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. తారా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు సంకె రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కవ్వంపల్లి స్వామి, దామెర శంకర్, మేజిక్ రాజా, దయానర్సింగ్, చంద్రపాల్, చీకటి అంజయ్య, కనకం రమణయ్య, చల్లా ప్రవీణ్, గజెల్లి రాజలింగం, పెద్దుల్ల శ్రీనివాస్, నర్సయ్య, పలు జిల్లాలకు చెందిన పురస్కార, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.