నెలాఖరులోగా ఉపాధిహామీ నిధులను వినియోగించాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:39 PM
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న నిధులను నెలాఖరులోగా పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న నిధులను నెలాఖరులోగా పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం రూ.19 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, ఈ నిధులను నెలాఖరులోగా ఖర్చు చేయడం లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. ప్రణాళిక చేసిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు అవసరమైన కొత్త పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, వీఓ భవనాలు, కల్వర్టులు తదితర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించి, నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా చేపట్టే పనులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడటంతోపాటు ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు. ప్రతీ పనిని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసి నిధుల వినియోగంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.