Share News

‘ఉపాధి’ కమిటీలు

ABN , Publish Date - May 24 , 2026 | 12:28 AM

ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ (విజిలెన్స్‌ మానిటరింగ్‌) కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడనుంది.

‘ఉపాధి’ కమిటీలు

జగిత్యాల, మే 23 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ (విజిలెన్స్‌ మానిటరింగ్‌) కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధి హామీ పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షలు జాబ్‌కార్డులు ఉండగా 2.73 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదు అయ్యారు. ప్రతీ సంవత్సరం చేపట్టే ఉపాధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పనుల్లో మార్గదర్శకాలు పాటించడం లేదంటూ పని దినాల్లో కోత విధించడం మొదలు పెట్టింది. దీంతో మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆరుగురు సభ్యులతో నిఘా కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఫపర్యవేక్షణ ఇలా..

కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు తగిన ప్రాతినిథ్యం ఉండగా సభ్యుల్లో సగం మంది మహిళలు ఉండనున్నారు. ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ టీచర్‌, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు, సోషల్‌ ఆడిట్‌ వనరుల వ్యక్తులు, యువజన సంఘాలు, సివిల్‌ సొసైటీ సంస్థల నుంచి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. గ్రామ సభ ద్వారా కనీసం 6 నెలల కాలానికి కమిటీని ఎన్నుకోవాలి. ఉపాధి పనులు జరగిన వారానికి క్షేత్ర స్థాయిలో పర్యటించి కమిటీలు పరిశీలిస్తాయి. పనుల మంజూరు, నాణ్యతను అంచనా వేయడం, కూలీల హాజరు, వేతన చెల్లింపులు పారదర్శకంగా జరిగాయా లేదా తదితర వివరాలను నమోదు చేస్తారు. సామాజిక తనిఖీ సమయంలో గ్రామసభకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలను ప్రజా పత్రాలుగా పరిగణించాలని, అవసరమైతే గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ నిర్ణయం మేరకే...

- రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాము. త్వరలోనే నిఘా కమిటీల ఏర్పాటుపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర్వులు వచ్చిన వెంటనే గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తాం.

జిల్లాలో వివరాలు...

జిల్లాలో జాబ్‌కార్డుల సంఖ్య....1.67 లక్షలు

జాబ్‌కార్డుల్లోని కూలీల సంఖ్య...2.73 లక్షలు

శ్రమ శక్తి సంఘాల్లోని కుటుంబాల సంఖ్య...1.05 లక్షలు

శ్రమ శక్తి సంఘాల్లోని కూలీల సంఖ్య...1.46 లక్షలు

Updated Date - May 24 , 2026 | 12:28 AM