నిప్పుల కుంపటి...
ABN , Publish Date - May 20 , 2026 | 11:38 PM
భానుడు భగభగమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కళ్యాణ్‌నగర్, మే 20(ఆంధ్రజ్యోతి): భానుడు భగభగమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఏడు గంటలకే సూర్యుడు సురసురమం టున్నాడు. ఉదయం పది గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం వాహనాల రద్దీతో ఉండే రాజీవ్ రహదారి వాహనాల రాకపోకలు తగ్గడంతో రోడ్లు ఖాళీగా ఉన్నాయి. రాత్రి తొమ్మిది దాటినా ఎండవేడి తగ్గడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప జనం ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. నిత్యం కొనుగోలు దారులతో రద్దీగా ఉండే కళ్యాణ్‌నగర్, లక్ష్మీనగర్, డాక్టర్స్ స్ర్టీట్, శివాజీనగర్‌లో వ్యాపార సంస్థలు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. రామగుండం ఉపరితల గనులలో 3 నుంచి 5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతున్నాయి. దీంతో ఉపరితల గనుల్లో ఉదయం రెండో షిప్టులలో కార్మికుల హాజరుశాతం తగ్గుతుంది. ఓసీపీ గనుల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరువలో ఉంటున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతే కార్మికులకు లే ఆఫ్ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో వాస్తవ ఉష్ణోగ్రతలను యాజమాన్యం దాచిపెడుతుంది. అత్యవసర పరిస్థితులలో టోపీలు, జేబురూమాళ్లు ధరించి బయటకు వస్తున్నారు. మధ్యాహ్నం వేళలలో వేడిగాలులతోపాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది. ఈనెల 25 నుంచి రోహిణికార్తె ప్రారంభం కానుంది. వారం రోజులు జనం ఇండ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
ఎనిమిది చోట్ల 46.0డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
జిల్లాలో గతంలో లేని విధంగా ఎండలు దంచికొట్టుతున్నాయి. బుధ వారం ఎనిమిది కేంద్రాలలో రికార్డ్ స్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా 11 కేంద్రాలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినాయి. ఓదెల 46.4 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ముత్తారం 46.3, ఈసాలతక్కళ్లపల్లి 46.3, కల్వచర్ల 46.3, మల్యాలపల్లి 46.2, పాలితం 46.2, ఆకెనపల్లి 46.0 ధర్మారం 46.0, రంగంపల్లి 45.9, భోజన్నపేట 45.6, మంథని 45.7, ఎలిగేడు 45.7, కమాన్‌పూర్ 45.7, కూనారం 45.3, కనుకుల 45.3, సుగ్లాంపల్లి 45.3, జూలపల్లి 45.1, రామగుండం 45.0, ఎగ్లాస్‌పూర్ 45.0, శ్రీరాంపూర్ 44.9, ముల్కలపల్లి 44.9 ఉష్ణోగ్రతలు నమోదైనాయి.
పని వేళలు మార్చాలి
యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పని వేళల్లో మార్పులు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) ఆర్జీ-2 వైస్ ప్రెసిడెంట్ కుమారస్వామి డిమాండ్ చేశారు. మొదటి షిఫ్టును ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ షిఫ్టు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 వరకు మార్చాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున యాజమాన్యం పని వేళల మార్పుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు.