గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:34 PM
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ఎండోమెంట్ శాఖ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన పనులను గుర్తించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖకు కొంత నిధులు కేటాయించినందున అవసరమైన పనులను గుర్తించి, వాటి అంచనాలు, ప్రతిపాదనలను రూపొందించి సంబంధిత ఆమోదాల కోసం వీలైనంత త్వరగా సమర్పించాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, రహదారులు, ఘాట్లు, తాగునీటి సదుపాయం, పారిశుధ్యం తదితర అంశాలకు సంబంధించిన పనులను ముందస్తుగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్ సింగ్, దేవాదాయ శాఖ ఏడీ సుప్రియ, ఇరిగేషన్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి
ఎలిగేడు, జూన్1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలని కలెక్టర్ కోయశ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ర్యాకల్‌దేవుపల్లి, రాములపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ నిర్మాణ స్థలాన్ని, పనులను పరిశీలించారు. గడువు లోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రంగా తేల్చాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో నిర్దేశించిన నాణ్యత ప్రామాణాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆర్డీఓ గంగయ్య, తహసిల్దార్ యాకయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.