వన మహోత్సవంపై ఎల్‌నినో ఎఫెక్ట్
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:05 AM
వనమహోత్సవం కార్యక్రమంపై ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాలు పడని కారణంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు సైతం రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వనమహోత్సవం కార్యక్రమంపై ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాలు పడని కారణంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు సైతం రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి.
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 27.58 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఆరు బయట ప్రదేశాల్లో 26.78 లక్షలు నాటాలని, ఇళ్లల్లో 8 లక్షల మొక్కలను నాటేందుకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 5.02 లక్షల మొక్కలు 18.20 శాతం మాత్రమే నాటారు. ఇందులో 3,74,300 మొక్కలు నాటగా, 1,27,800 మొక్కలను ఇళ్లల్లో నాటుకునేందుకు పంపిణీ చేశారు. వాస్తవానికి యేటా జూలై నెలాఖరు వరకు, ఆగస్టు మొదటి వారంలో గానీ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి కానున్నది. వర్షాలు పడని కారణంగా మొక్కలు నాటడం లేదు. జిల్లాలో ప్రధానంగా అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు రోడ్లకు ఇరు వైపులా, ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో మొక్కలను నాటాలని నిర్ణయించారు. రాష్ట్రంలో అడవుల శాతం తగ్గడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నది. దీంతో సకాలంలో వర్షాలు పడక కరువుఛాయలు కమ్ముకున్నాయి. వర్షా భావ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత యేటా వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడాలంటే పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హరిత హారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2015 నుంచి మొక్కలు నాటడడం ఆరంభించారు. దీంతో రాష్ట్రంలో, జిల్లాలో అడవుల శాతం పెరగడంతో ఆశిం చిన స్థాయిలో వర్షాలు పడడం ఆరంభమయ్యాయి. అంతేగాకుండా పర్యావరణం కూడా పెరుగుతున్నది. మొక్కల పెంపకానికి గత ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. గ్రామం, పట్టణంలో వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా, ఖర్చు ఆదా చేసేందుకు నాటి ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకున్నది. జిల్లాలో 260 నర్సరీలను ఏర్పాటు చేశారు. వాటిని గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వహిస్తున్నారు. ఇవేగాకుండా అటవీ శాఖ ద్వారా కూడా 20కి పైగా నర్సరీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరితహారం పేరును వన మహోత్స వంగా మార్చి యేటా మొక్కలు నాటుతున్నారు. నర్సరీల్లో నీడనిచ్చే మొక్కలతో పాటు జామ, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు, గులాబీ, గన్నేరు, మందార, తదితర పూల మొక్కలను యేటా పెంచుతున్నారు. జిల్లా టార్గెట్‌కు అనుగుణంగా మొక్కలు అందుబాటులో ఉన్నాయని డీఆర్‌డీవో, అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా అవసరం మేరకు కూలీలు గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు. ఈసారి గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకుగాను 3 వేల ఈత మొక్కలు, 420 తాటి మొక్కలను నాటాలని నిర్ణయించారు. గత నెల 18వ తేదీ నుంచే వనమహోత్సవం కార్యక్రమం ఆరంభమైనప్పటికీ, ఎల్‌నినో ప్రభావంతో ముందుకు సాగడం లేదు.
శాఖల వారీగా మొక్కలు నాటాల్సిన లక్ష్యం, నాటినవి..
-------------------------------------
క్ర.సం. శాఖ లక్ష్యం నాటినవి
------------------------------------
1. అటవీ శాఖ 85,000 16,400
2. ఆర్‌టీసీ 500 200
3. పంచాయతీరాజ్ 5,000 నిల్
4. డీఆర్‌డీఓ 14,25,000 3,98,900
5. నీటి పారుదల శాఖ 20,000 6,400
6. వ్యవసాయ శాఖ 1,00,000 నిల్
7. మార్కెటింగ్ 500 నిల్
8. ఉద్యాన శాఖ 1,000 600
9. ఎక్సైజ్ శాఖ 4,000 నిల్
10. దేవాదాయ శాఖ 500 నిల్
11. మున్సిపల్ శాఖ 6,50,000 19,800
12. పోలీస్ శాఖ 10,000 నిల్
13. అగ్నిమాపక శాఖ 100 నిల్
14. ఇంటర్ కళాశాలలు 1,000 నిల్
15. యూనివర్శిటీ 3,400 నిల్
16. జిల్లా విద్యా శాఖ 3,000 1,100
17. పశుసంవర్థక శాఖ 200 నిల్
18. పరిశ్రమల శాఖ 4,50,000 58,700
19. వైద్య ఆరోగ్య శాఖ 500 నిల్
20. విద్యుత్ శాఖ 200 నిల్
21. ఐసీడీఎస్ శాఖ 500 నిల్
22. ఎస్సీ సంక్షేమ శాఖ 500 నిల్
23. బీసీ సంక్షేమ శాఖ 500 నిల్
24. గిరిజన సంక్షేమ శాఖ 300 నిల్
25. మైనార్టీ సంక్షేమ శాఖ 200 నిల్
26. యువజన, క్రీడలు 100 నిల్
27. రైల్వే శాఖ 500 నిల్
28. ఇతర శాఖలు 500 నిల్