Share News

అర్హుల పేర్లు ఉండేలా కృషి చేయాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:23 PM

రామగుండం నియోజక వర్గంలో ఓటరు జాబితాలో ప్రతీ అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్‌ శ్రేణులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ సర్‌, బీఎల్‌ఏ ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

అర్హుల పేర్లు ఉండేలా కృషి చేయాలి

గోదావరిఖని, జూలై 3(ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజక వర్గంలో ఓటరు జాబితాలో ప్రతీ అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్‌ శ్రేణులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ సర్‌, బీఎల్‌ఏ ఇన్‌చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, పురోగతి, బీఎల్‌ఏలు చేపట్టాల్సిన బాధ్యతలు, ప్రజలకు అందించాల్సిన సహ కారంపై బీఎల్‌ఏలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలని, బీఎల్‌ఏలు బాధ్యతయుతంగా పని చేయాలని కోరారు. ప్రతీ బూత్‌ పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు సర్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులు నింపడంలో సహకరించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం, తప్పులు ఉండడం, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించాలన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేసి ప్రతి పోలింగ్‌ బూత్‌లో సర్‌ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రతీ దరఖాస్తు సక్రమంగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు సేవాభావంతో పని చేస్తే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్‌, తిప్పారపు శ్రీనివాస్‌, సుతారి లక్ష్మణ్‌బాబు, కొప్పుల శంకర్‌, గుండేటి రాజేష్‌, ఉరిమెట్ల లింగయ్య, పెండ్యాల మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:23 PM