విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:24 AM
వ్యక్తులపై కాకుండా వ్యవస్థ ఆధారంగా పనిచేసేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేశారు.
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): వ్యక్తులపై కాకుండా వ్యవస్థ ఆధారంగా పనిచేసేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, 40 ఏళ్ల క్రితం ఉన్న విద్యా వ్యవస్థకు, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విద్యా వ్యవస్థకు ఎంతో తేడా ఉందన్నారు. వ్యవస్థ చాలా వేగంగా మారుతున్న నేపథ్యంలో మనం అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో వ్యక్తులపై ఆధారపడకుండా, వ్యవస్థ ఆధారంగా పనిచేసేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కేవలం నంబర్లు, ర్యాంకుల కోసం ప్రయత్నించలేదని, ప్రక్రియను బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలోని పలువురు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులతో నిరంతరం చర్చిస్తూ విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అందరి సమష్టి కృషి, సహకారంతో మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. విద్యార్థుల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 58 మంది ఉపాధ్యాయులను సన్మానించి, అవార్డులు అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పిఎం.షేక్, సెక్టోరియల్ అధికారి, మల్లేశం మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.