డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే కేటాయించాలి
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:06 AM
ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి గృహ నిర్మాణ శాఖ పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఓదెల, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి గృహ నిర్మాణ శాఖ పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండకుండా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియలను వేగవంతం చేసి కేటాయింపులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద కేంద్ర నిధులు పొందేందుకు అవసరమైన లబ్ధిదారుల వివరాలను సెప్టెంబర్ 5లోగా ఎంఐఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. డేటా నమోదులో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు అర్హులైన లబ్ధిదారుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణ పథకాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.