వర్షాభావం గురించి బెంగవద్దు
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:23 PM
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయో కురవవో అన్న బెంగ రైతులు పెట్టుకోవద్దని, ప్రస్తుతం సమృద్ధిగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు.
సుల్తానాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయో కురవవో అన్న బెంగ రైతులు పెట్టుకోవద్దని, ప్రస్తుతం సమృద్ధిగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సదస్సులో గురువారం ఆయన మాట్లాడారు. యథావిధిగా పంటలు సాగు చేసుకోవాలని, సీజన్‌లో నాలుగు వానలు గట్టిగాపడితే సాగుకు ఢోకా ఉండదన్నారు. అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ పంట మార్పిడిపై ఆసక్తి చూపాలన్నారు. యాసంగి సీజన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్ఢు స్థాయిలో దిగుబడులు వచ్చాయని ఇప్పటి వరకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. నియోజకవర్గంలో సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో కేంద్రాలు ఎత్తివేశామని, అలాగే మరో మూడు నాలుగు రోజుల్లో మిగత మండలాల్లో కొనుగోళ్ళు పూర్తవుతాయన్నారు.
ధాన్యం నిల్వ చేసేందుకు పలు మండలాల్లో గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ సీజన్‌లో లక్షా డెబ్బైఐదు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులను నిలువ చేసేందుకు గోదాముల నిర్మాణం చేస్తున్నామన్నారు. లాలపల్లిలో రూ.16 కోట్లతో 20 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో మరో 80 మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి స్థలాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. శీతల గిడ్డంగుల నిర్మాణం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఎవరైనా చనిపోయిన సందర్బంలో వారికి ఐదు లక్షల బీమా వర్తిస్తుందన్నారు. మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాదాక్రిష్ణ, జిల్లా వ్యవసాయ అదికారి శ్రీనివాస్, ఏఓ పైడితల్లి, కిరణ్, డాక్టర్ సిందుజ తదితర అధికారులు మాట్లాడారు.