Share News

తొలకరికే తొందరొద్దు..

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:35 AM

తొలకరికే తొందరపడి విత్తనాలు వేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన జగిత్యాలపై పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎ

తొలకరికే తొందరొద్దు..

జగిత్యాల, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): తొలకరికే తొందరపడి విత్తనాలు వేయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రభావం వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన జగిత్యాలపై పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినోతో రుతు పవనాలు గతి తప్పే అవకాశం ఉండడంతో రైతులు సాగు పద్ధతుల్లో మార్పులు చేసుకుంటే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబరు మధ్యలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు

ఈ యేడాది ఆగస్టు, సెప్టెంబరు మధ్యలో ఎల్‌నినో ముప్పు ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు. గత యేడాది మే చివరి వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని, ఈ యేడాది ఆలస్యంగా ఈనెల రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు బృందాలుగా ఆయా మండలాల్లో పర్యటించి ఎల్‌నినో పరిస్థితులను వివరించి పంటల ప్రణాళికపై దిశా నిర్దేశం చేస్తున్నారు.

తొలివాన తర్వాత విరామం..

తొలకరి జల్లులు కురవగానే విత్తనాలు వేయడం రైతులకు అలవాటుగా మారింది. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పుడు తొలివాన అనంతరం పెద్ద విరామం రావొచ్చన్న అభిప్రాయాలున్నాయి. నేల కనీసం 3 నుంచి 5 అంగుళాలు తడిస్తేనే విత్తనం వేయాల్సి ఉంటుంది. లేదంటే మొలకలు ఎండిపోయి పెట్టుబడులు వృథా అవుతాయి. నీటి నిల్వలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈసారి వరి తదితర పంటల కంటే తక్కువ నీరు అవసరమయ్యే ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన విత్తనాలను సిద్ధంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో వానాకాలం సాగు అంచనా...

జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా వానాకాలంలో పంటల సాగు అవుతుందన్న అంచనాను అధికారులు వేశారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,35,978 ఎకరాలు కాగా ఈ సీజన్‌లో 4,25,950 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇది సాధారణం కన్నా 89,972 ఎకరాలు అధికంగా ఉంది. ప్రధానంగా వరి 3,16,000 ఎకరాలు, మొక్కజొన్న 35,000 ఎకరాలు, కందులు 1,500, పెసర్లు 100, సోయా చిక్కుడు 800, పత్తి 19,000, చెరుకు 350 ఎకరాలు, పసుపు 9,500, మిరప 550 ఎకరాలు, పలు కూరగాయల పంటలు 350 ఎకరాలు, ఆయిల్‌ ఫాం 5,000 ఎకరాలు, మామిడి 37,000 ఎకరాలు, ఇతర పంటలు 450 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు.

సాగు పద్ధతులు మార్చుకోవాలి

- భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

సాగు పద్ధతులను మార్పు చేసుకుంటే ఎల్‌నినో వంటి సవాళ్లను సైతం ఎదుర్కొనవచ్చు. ఈసారి రుతు పవనాలు క్రమం తప్పే అవకాశం ఉందనే అంచనాతోనే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా వర్షాభావ పరిస్థితుల గురించి రైతులను అప్రమత్తం చేశాం. మూస ధోరణిలో కాకుండా వ్యవసాయ, వాతావరణ నిపుణుల సూచనల మేరకు పంటలు సాగు చేస్తేనే రైతులు గట్టెక్కే అవకాశం ఉంది.

గత యేడాది వర్షపాతం (మిల్లీ మీటర్లలో)...

----------------------------------------------------------------------------

నెల - సాధారణం - కురిసింది - వ్యత్యాసం - స్థితి

----------------------------------------------------------------------------

జూన్‌ - 153 - 121 - మైనస్‌ 21 - లోటు

జూలై - 285 - 211 - మైనస్‌ 26 - లోటు

ఆగస్టు - 238.7 - 319.4 - ప్లస్‌ 34 - అధికం

Updated Date - Jun 07 , 2026 | 12:35 AM