Share News

సింగరేణి రక్షణకు ప్రత్యక్ష పోరాటం

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:50 PM

తెలంగాణ కొంగు బంగారంగా పేరుగాంచిన సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నదని ఆ సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ కాజిపల్లిలోని శ్రీమయి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన టీజీబీకేఎస్‌ కేంద్ర కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు.

సింగరేణి రక్షణకు ప్రత్యక్ష పోరాటం

జ్యోతినగర్‌, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కొంగు బంగారంగా పేరుగాంచిన సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నదని ఆ సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ కాజిపల్లిలోని శ్రీమయి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన టీజీబీకేఎస్‌ కేంద్ర కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. సింగరేణిలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని, అధిక ధరలకు కొనుగోల్లు చేపట్టి కమీషన్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగరేణిని కాపాడే బాధ్యత కార్మికులపైనే ఉందన్నారు. సైట్‌ విజిట్‌ల పేరిట జరిగిన ఖర్చులు, ఎక్స్‌ప్లోజివ్‌ టెండర్లు, ఓబీ కాంట్రాక్టులు, 800 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, లోకల్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. కార్మికుల ప్రయోజనాల రక్షణకు బీఆర్‌ఎస్‌ పార్టీ సహకారంతో రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఉద్యమాలు చేపడుతామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలకు రెండు నుంచి మూడు మెడికల్‌ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. అనారోగ్య కార్మికులు, శారీరక వైకల్యం ఉన్న ఉద్యోగులకు ఫిట్‌ ఫర్‌ సేమ్‌ జాబ్‌ పేరుతో న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. మారుపేర్ల సమస్యలు, విజిలెన్స్‌ కేసులు, క్రమశిక్షణ పేరుతో ఇంక్రిమెంట్లు నిలిపివేయడం, ఉద్యోగాల నుంచి తొలగించిన వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గనుల్లో అవసర మైన సేఫ్టీ పరికరాలు, డ్రిల్‌ బిట్లు, రాడ్లు, మందులు, ఆయిల్‌, లూబ్రికెంట్ల కొర తను తీర్చాలని కోరారు. భారీ యంత్రాల కొనుగో ళ్లలో ప్రైవేటీకరణను అడ్డు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. వచ్చే నెల 9న అన్ని గనుల వద్ద గేట్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేసి కార్మికులను చైతన్యం చేస్తాన్నారు. టీజీబీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామ్మూర్తి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నూనె కొమురయ్యతోపాటు మంగీ లాల్‌, ప్రభాకర్‌ రెడ్డి, బడికెల సంపత్‌, చెల్పూరి సతీష్‌, సదానందం, వడ్డేపల్లి శంకర్‌, ఐలి శ్రీనివాస్‌, మలరాజు శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్‌, బడితల సమ్మయ్య, గడప రాజయ్య, నాగలి వెంకటేశ్వర్లు, జాఫర్‌ హుస్సేన్‌, రాజశేఖర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:50 PM