Share News

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:52 PM

తహసీల్దార్‌ కార్యాలయ పనులు త్వరగా పూర్తిచేయాలని, జూన్‌ 2 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో కలెక్టర్‌ పర్యటించారు. తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

ముత్తారం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌ కార్యాలయ పనులు త్వరగా పూర్తిచేయాలని, జూన్‌ 2 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో కలెక్టర్‌ పర్యటించారు. తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, మండల కేంద్రంలో నిర్మిస్తున్న తహసీల్దార్‌ కార్యాలయ పనులు మందకొడిగా సాగుతున్నాయని, పనుల వేగాన్ని పెంచి జూన్‌ 2 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని 28 పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేసవి సెలవుల్లోనే పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. పాఠశాలల పెయింటింగ్‌ సహా మౌలిక వసతుల పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ మధుసూదన్‌, పీఆర్‌ ఏఈ జగదీష్‌ పాల్గొన్నారు.

ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు నగదు పురస్కారం

పెద్దపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఫేస్‌ అథెంటికేషన్‌ యాప్‌ ద్వారా కూలీల హాజరును నమోదు చేయడంలో కృషి చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష నగదు పురస్కారాన్ని అందజేశారు. ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మిడిదొడ్డి స్వప్న రోజుకు గరిష్టంగా 194 మంది కూలీలతో పని చేయిస్తూ జిల్లాలోనే రికార్డు స్థాయిలో కూలీల హాజరును నమోదు చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ 5 వేల రూపాయలు నగదు పురస్కారాన్ని అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంలో కొలనూర్‌ గ్రామం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇతర పంచాయతీలు కూడా ఇదే స్ఫూర్తితో కూలీలకు పని కల్పించాలని ఆయన సూచించారు. డీఆర్‌డీఓ కాళిందిని, అదనపు జిల్లా కార్యక్రమ సమన్వయకర్త సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:52 PM