అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:25 PM
మండలంలోని అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఓదెలలో కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న ఐకేపి భవనంలో సివిల్ కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా, వినియోగించుకునే విధంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓదెల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఓదెలలో కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న ఐకేపి భవనంలో సివిల్ కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా, వినియోగించుకునే విధంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.75లక్షల వ్యయంతో నిర్మాణమైన రెవెన్యూ నూతన కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో మౌలిక సౌకర్యాల ఏర్పాటును పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి కార్యాలయ ప్రారంభానికి అందించాలని సూచించారు. భూభారతి ద్వారా కొమిరకు చెందిన రైతులు దరఖాస్తులు అందజేయగా గ్రామాన్ని సందర్శించి భూములను పరిశీలించారు. భూముల సమస్య పరిష్కారంలో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం ఓదెలలో నూతి సరోజన, రజిత నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాలను కలెక్టర్ పరిశీలించారు. ఈనెల 15 వరకు ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసి భూభారతి, మీసేవ దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు. కార్యాలయాలకు వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండ ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేసే విధంగా ప్రణాళికను తయారు చేసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ వనజ, ఎంపీడీవో అనిల్ రెడ్డి, సర్పంచులు కనికి రెడ్డి సతీష్,గంగిశెట్టి ప్రభాకర్, డాక్టర్లు, ఆర్‌ఐ గౌతమ్ పాల్గొన్నారు.