ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమ చేపల చెరువుల కూల్చివేత
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:45 PM
జిల్లాలోని శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమంగా ఆక్రమణలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో స్పందించిన జిల్లా యంత్రాం గం ఏడాదిన్నర తర్వాత చర్యలకు దిగింది. ప్రాజెక్టు భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ చేపల చెరువులను అధికారులు కూల్చివేసి సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ‘
పెద్దపల్లి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్ భూముల్లో అక్రమంగా ఆక్రమణలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంతో స్పందించిన జిల్లా యంత్రాం గం ఏడాదిన్నర తర్వాత చర్యలకు దిగింది. ప్రాజెక్టు భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ చేపల చెరువులను అధికారులు కూల్చివేసి సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ‘అక్రమ చేపల చెరువులతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూముల కబ్జా‘ శీర్షికన 2024 డిసెంబరు 20వ తేదీన ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన కథనంపై స్పందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖాధికారులు జాయింట్ సర్వే చేపట్టాలని ఆదే శించారు. విచారణలో ప్రాజెక్టు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఆక్రమణలు జరిగినట్లు తేలడంతో సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన మొత్తం 22 అక్రమ చేపల చెరువులను తొలగించినట్లు కలెక్టర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ముర్మూర్ గ్రామంలో 17, సోమ న్‌పల్లిలో 2, పొట్యాలలో 2, ఎల్లంపల్లి గ్రామంలో ఒక చెరువును గుర్తించి కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ఈ కూల్చివేతలతో గత ఆరు సంవత్సరాలుగా ఆక్రమణకు గురైన సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కూల్చివేత కార్యక్రమంలో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మత్స్యశాఖల అధికారులు సమన్వ యంతో పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ భూములను ఎవరైనా అనుమతులు లేకుండా ఆక్రమిస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.