ప్రజల్లో చైతన్యం ద్వారానే సైబర్ నేరాల అడ్డుకట్ట
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:03 AM
సమాజంలో సైబర్ నేరాలే అతిపెద్ద నేరాలుగా మారాయని, మామూలు దొంగతనాల్లో బాధితులు వేలు నష్టపోతే సైబర్ నేరాల్లో లక్షలు పోగొట్టుకుంటున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన మాసోత్సవం ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ వారియర్స్ ఆధ్వర్యంలో సెల్‌ఫోన్ల లైట్లతో ర్యాలీ నిర్వహించారు
కోల్‌సిటీ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సమాజంలో సైబర్ నేరాలే అతిపెద్ద నేరాలుగా మారాయని, మామూలు దొంగతనాల్లో బాధితులు వేలు నష్టపోతే సైబర్ నేరాల్లో లక్షలు పోగొట్టుకుంటున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన మాసోత్సవం ముగింపు సందర్భంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ వారియర్స్ ఆధ్వర్యంలో సెల్‌ఫోన్ల లైట్లతో ర్యాలీ నిర్వహించారు. సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ వ్యక్తి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటుందని, అదే సమయంలో సైబర్ నేరస్థులు కూడా వీరినే టార్గెట్‌గా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సోషల్ మీడియాను అతిగా వినియోగించడం వల్ల అవసరం లేని వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతుందని, వారు టార్గెట్‌గా చేసుకుని పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేస్తున్నారన్నారు. ఆఫర్లు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, డిజిటల్ అరెస్టుల పేర భయ భ్రాంతులకు గురి చేసి సొమ్ము లాగుతున్నారన్నారు. ఏదైన సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని, నేరం జరిగిన వెంటనే తక్కువ సమయంలో ఫిర్యాదు చేస్తే సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతిలో పడక ముందే కాపాడుకోవచ్చునన్నారు. కమిషరేట్‌లో సైబర్ క్రైమ్ టీమ్, సైబర్ వారియర్లు సమర్థవంతంగా పని చేస్తున్నారని, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. సైబర్ క్రైమ్ డీఎస్‌పీ రంగారెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సైబర్ క్రైమ్ సీఐలు రాణా ప్రతాప్, శ్రీనివాస్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.