స్పెషలిస్టులు లేని క్రిటికల్ కేర్
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:01 AM
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్‌ను మంజూరు చేసింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చికిత్స కోసం పేషంట్లు వస్తుంటారు.
సుభాష్‌నగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్‌ను మంజూరు చేసింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చికిత్స కోసం పేషంట్లు వస్తుంటారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర వైద్య సంబంధిత పేషంట్లు కూడా వస్తుంటారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్ పడకలు 20 వరకు ఉన్నాయి. అత్యవసర పేషంట్లు, సీరియస్ పేషంట్లను అందులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుబంధ ఆసుపత్రిగా మార్చారు. ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిగా కొనసాగుతుంది. జిల్లా ఆసుపత్రిగా ఉన్నపుడు జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జన్లతోపాటు, ఆర్థో, ఈఎన్‌టీ, ఆప్తాల్మిక్ వంటి వైద్యులు సేవలు అందించేవారు. మెడికల్ కళశాలకు అనుబందం అయినతరువాత ప్రతి డిపార్టుమెంట్‌కు సంబందించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, హెచ్‌వోడీలతోపాటు రెసిడెంట్, పీజీ వైద్యులు సేవలందిస్తున్నారు.
క్రిటికల్ కేర్ ఎందుకు....
ప్రస్తుతం ఏదైనా సీరియస్ కేసు వచ్చినపుడు వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు రెఫర్ చేస్తున్నారు. అలా పంపకుండా కరీంనగర్‌లో వైద్యం అందించాలని ప్రభుత్వం జిల్లా జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, క్రిమిసంహాకర మందులు తాగినవారు, కార్డియాలజీ, న్యూరాలజీకి సంబందించిన పేషంట్లకు ఇక్కడే చికిత్స అందించవచ్చు. అందుకు పీఎం ఆయూష్మాన్ భారత్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి నాటి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు 2023 మార్చి 3న శంకుస్థాపన చేశారు. 23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించారు. కేంద్ర హోశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ ఈ క్రిటికల్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు.
వైద్యులు, సిబ్బంది కొరత
క్రిటికల్ కేర్ సేవలు ప్రారంభించాలంటే స్పెషలిస్టులు, ఇతర వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటుంది. క్రిటికల్ కేర్‌లో జనరల్ మెడిసిన్, ఎమర్జెన్సీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, అనస్థేషియా, న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్, కార్డియాలజీ, పిడియాట్రిక్ ఇతర విభాగాలకు సంబందించిన స్పెషలిస్టులు, సూపర్‌స్పెషలిస్టు వైద్యులు అన్ని విభాగాలకు కలిపి 50 మంది వరకు అవసరముంటుంది. వారితోపాటుగా అర్హతగల టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది అవసరం ఉంటుంది. క్రిటికల్ కేర్ సెంటర్‌లో ఇంతవరకు స్పెషలిస్టు వైద్యులను నియమించలేదు. వారు విధుల్లో చేరితే ఆయా డిపార్టుమెంటుల వారీగా మరిన్ని పరికరాలు అవసరమవుతాయి. ప్రభుత్వం ఇంతవరకు స్పెషలిస్టులను నియమించకపోవడం వల్ల అత్యవసర చికిత్స అందించాల్సిన పేషంట్లను వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్‌కు తీసుకువెళ్లాల్సి వస్తోంది. క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభంమై తొమ్మిది నెలలు కావస్తున్నా ఇంతరకు సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేకపోవడంతో ఈ సెంటర్ తెరిచికూడా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఆర్థిక భారం తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదికలు పంపించాం..
-డాక్టర్ వీరారెడ్డి, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్
క్రిటికల్ కేర్‌లో సూపర్‌స్పెషాలిటీ వైద్యుల ఏర్పాటుకు సంబందించిన నివేదికలను ప్రభుత్వానికి పంపించాం. ఆయా స్పెషలిస్టులకు సంబందించిన పరికరాలు కూడా రావాల్సి ఉంది. ప్రభుత్వం వాటిని సమకూర్చుతుంది.