సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలుచేయాలి
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:56 PM
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం ఐఎంఏ హాల్‌లో జరిగింది.
పెద్దపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం ఐఎంఏ హాల్‌లో జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు కోటి వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, ఈహెచ్‌ఎస్ పథకాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా ఉద్యోగ కుటుంబాలకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే ఆంక్షలు లేని ఈహెచ్‌ఎస్ విధానాన్ని రూపొందించి ఉద్యోగులకు సులభంగా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ, ఇతర బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని, ఉద్యోగుల ప్రయోజనాలే సంఘానికి ప్రథమ ప్రాధాన్యమని సమావేశంలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ స్కీంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే సంఘ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అయిరెడ్డి సందీప్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు అనితారెడ్డి, కోశాధికారి కొమురయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, స్వప్నకుమారి, సంయుక్త కార్యదర్శులు ప్రవీణ్, శ్రీధర్, రమేష్, సౌమ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి, పబ్లిసిటీ సెక్రటరీ నిశాంత్ రావు, పలు యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.