పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్న కౌన్సిలర్లు
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:28 AM
సుల్తానాబాద్ మున్సి పాలిటీ పరిధిలో గెలుపొందిన కౌన్సిలర్లు పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. ఈ నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచే కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు మరో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి శ్రావణితో కలుపుకొని క్యాంపునకు తరలివెళ్ళారు. ఎమ్మెల్యేను కలిసి అదే రోజు రాత్రి షిర్డీ వెళ్ళారు.
సుల్తానాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్ మున్సి పాలిటీ పరిధిలో గెలుపొందిన కౌన్సిలర్లు పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. ఈ నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచే కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు మరో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి శ్రావణితో కలుపుకొని క్యాంపునకు తరలివెళ్ళారు. ఎమ్మెల్యేను కలిసి అదే రోజు రాత్రి షిర్డీ వెళ్ళారు. రెండు రోజుల నుంచి వారు అక్కడే ఉంటూ సమీప పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కౌన్సిలర్ అభ్యర్థులు ఈ నెల 16న ఉదయం ప్రమా ణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ ఒక రోజు వెసలుబాటు కూడా ఉండడంతో మరుసటి రోజు ఈ నెల 17న నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం యథావిధిగా సోమవారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రకటించని చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు
సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ ఎవరిని వరించనున్నదో ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అంతర్గత సమావేశాల్లో తప్ప చైర్మన్ పీఠాన్ని ఎవరు పొందనున్నారో ప్రకటించడం లేదు. పార్టీ అంతర్గత సమా వేశాల్లో ఎమ్మెల్యే చైర్మన్‌గా బిరుదు రాధాక్రిష్ణను ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు సేవలకు గుర్తింపుగా ఆయన కుమారుడు రాధాక్రిష్ణను చైర్మన్‌గా చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయనతోపాటు గాజుల రాజమల్లు, అంతటి పుష్పలత లు కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే నిర్ణయమే తుది నిర్ణయంగా తేలనుంది.
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశాం : కమిషనర్ రమేష్
ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం సోమవారం అభ్యర్థులచే ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లా పంచాయతీ అఽధి కారి వీర బుచ్చయ్యను ప్రత్యేకాధికారిగా కలెక్టర్ నియమించారు. ఈ నెల 16న ప్రమాణ స్వీకారంలో అభ్యర్థులు పాల్గొనాలని సమాచారం అందించాం. అయితే వారు ఈ నెల 16న హాజరవుతే వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తాం లేదంటే మరుసటి రోజు అంటే ఈ నెల 17న చేయిస్తాం. ఆ రోజు కూడా వీలు కానీ పక్షంలో ఈ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘంకు తెలియజేస్తాం.