సింగరేణిలో అవినీతి పెరిగిపోయింది
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:24 PM
సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గోదావరిఖని, జూన్ 4(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణిలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు జరుగుతున్నాయని, దీనిని కార్మిక లోకానికి, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి జేబు సంస్థలా, ఏటీఎంలా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయలు సంస్థకు చెల్లించకుండా మిగులు బడ్జెట్‌లో నాలుగు వేల కోట్ల ఓడీ ఉన్న సింగరేణి సంస్థ జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న అనేక అవినీతి కుంభకోణాలపై అసెంబ్లీ సాక్షిగా హరీష్‌రావు బయట పెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి నైని బ్లాక్ కట్టబెట్టేందుకే కుట్రలు పన్నుతున్నారని, గతంలో సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రెండు సంవత్సరాల కాలంలో మెడికల్ బోర్డు, డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఈ నెల 7న గోదావరిఖనిలో కాంగ్రెస్ హఠావో, సింగరేణి బచావో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి, చెల్పూరి సతీష్, కార్పొరేటర్ సమ్మయ్య పాల్గొన్నారు.