పాత విధానంలోనే కోఆప్షన్ పదవులు
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:54 PM
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాని వారు, పోటీ ప్రక్రియ నుంచి తప్పుకున్న నాయకులు కోఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కోఆప్షన్ పదవులు పెరుగుతాయని ఆశ పడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ మున్సిపల్ డైరెక్టర్ టీకే శ్రీదేవి కోఆప్షన్ పదవుల భర్తీకి ఆదేశాలు జారీచేశారు.
కోల్‌సిటీ, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాని వారు, పోటీ ప్రక్రియ నుంచి తప్పుకున్న నాయకులు కోఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కోఆప్షన్ పదవులు పెరుగుతాయని ఆశ పడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ మున్సిపల్ డైరెక్టర్ టీకే శ్రీదేవి కోఆప్షన్ పదవుల భర్తీకి ఆదేశాలు జారీచేశారు. జీవో నెం. 57, 58ని అనుసరించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. దీనితో పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లయ్యింది. మున్సిపాలిటీల్లో నాలుగు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఐదు కో ఆప్షన్ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రామగుం డం నగరపాలక సంస్థతో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. రామగుండం నగరపాలక సంస్థలో 60 డివిజన్లు ఉన్నాయి. పెద్దపల్లిలో 36, మంథనిలో 13, సుల్తానాబా ద్‌లో 15వార్డులు ఉన్నాయి. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కోఆప్షన్ పదవుల భర్తీకి ప్రభుత్వం జీవో నెం.57, 58లను తేది:16-03-2020న జారీ చేసింది. ఈ జీవోలను అనుసరించి ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన కోటా, మైనార్టీ కోటాలో పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. రామగుండం నగరపాలక సంస్థలో ఐదు కోఆప్షన్ పదవులు ఉండగా మూడు ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన కోటాలో, రెండు మైనార్టీ కోటాలో భర్తీ చేశారు. అలాగే పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల రెండు ప్రత్యేక పరిజ్ఞానం, రెండు మైనార్టీలకు కేటాయించారు. రామగుండం నగరపాలక సంస్థలో ఐదుగురు కో ఆప్షన్ సభ్యులకు అవకాశం ఇచ్చారు. ఇందులో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న ముగ్గురు సభ్యుల్లో ఒకరు మహిళ ఉండాలనే నిబంధన పెట్టారు. అల్పసంఖ్యాకవర్గాల (మైనార్టీ) కోటాలో రెండు కేటా యించి ఒకరు మహిళ ఉండాలని నిబంధన పెట్టారు.
ఆశావాహుల ఆశలపై నీళ్లు...
మున్సిపాటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో కోఆప్షన్ పదవుల భర్తీ సందర్భంగా పార్టీలో పని చేసిన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కోఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రామగుం డం మున్సిపల్ కార్పొరేషన్‌లోనే ఎవరికి వారుగా కో ఆప్షన్ బరిలో ఉన్నామంటూ ప్రకటించుకుంటున్నారు. కోఆప్షన్ పదవులకు సంబంధించి అర్హతలను పట్టించుకోకుండానే తమకు కోఆప్షన్ పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు. ఒక్క రామగుండంలోనే వంద మందికిపైగా ఆశావహులు ఉన్నారు. 10 పదవులు ఉంటాయని కొందరు, 15పదవులు ఉంటాయని కొందరు ప్రకటించుకుంటు న్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ల్లోనూ ఇదే తరహా పరిస్థితులున్నాయి.
పదవులు పెంచకపోవడంపై అసంతృప్తి
మున్సిపాలిటీల్లో కోఆప్షన్ పదవుల పెంపుపై ప్రభుత్వం మొదట సంకేతాలిచ్చింది. చివరికి ట్రాన్స్‌జెండర్లకు కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లలో అవకాశాలుంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం మున్సిపల్‌శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉంది. ఈ పరిస్థితుల్లో పదవులు పెరుగుతాయని పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ జీవో నెం. 57, 58 ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరిగిన మొదటి సమావేశం నుంచి 60రోజుల లోపు కో ఆప్షన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ఫిబ్రవరి 16, 17 తేదీల్లో మున్సిపల్ చైర్మన్లు, మేయర్ ఎంపిక పూర్తయ్యింది. అప్పటి నుంచి 60రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ డైరెక్టర్ టీకే శ్రీదేవి మున్సిపల్ కో ఆప్షన్ పదవులను భర్తీ చేయాలంటూ సర్క్యూలర్ జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం నుంచి పదవుల పెం పుపై ఆదేశాలు రానందునే ఈ సర్క్యూలర్ వచ్చిందనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.
ప్రత్యేక పరిజ్ఞానం కోటాలో అర్హతలు...
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో ప్రత్యేక పరిజ్ఞానం కోటాలో కోఆప్షన్ పదవుల భర్తీకి సంబంధించి వారం రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. 21 సంవత్సరాల వయసు, 5సంవత్సరాలు తక్కువ కాకుండా మున్సిపా లిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్, కార్పొరేటర్‌గా బాధ్యతలు నిర్వహించి ఉండాలి. మున్సిపాలిటీ పరిధిలోని మండలంలో ఏదైనా గ్రామ పంచాయతీ నుంచి ఐదు సంవత్సరాలు తక్కువ కాకుండా సర్పంచ్, ఉప సర్పం చ్, వార్డు మెంబర్ పదవులు నిర్వహించి ఉండాలి. మున్సిపల్ స్టాం డింగ్ కౌన్సిల్ మూడు సంవత్సరాలు పని చేసిన న్యాయవాదులు, పురపాలక పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం అనుభవం కలిగి ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో గెజిటెడ్ హోదా కలిగి ఉండి పదవీ విరమణ పొందిన వారు కూడా అర్హులు.