సీహెచ్‌సీ భవనం పేరు విషయంలో ముదిరిన వివాదం
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:27 AM
మండలంలోని మేడారంలో ఇటీవల ప్రారంభించిన 30 పడకల ఆసుపత్రి భవనానికి రాసిన పేరు విషయంలో వివాదం ముదురుతోంది. మా ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి మంజూరు చేసి శంకుస్థాపన చేశామని బీఆర్‌ఎస్ నాయకులు శనివారం సీహెచ్‌సీ ఎదుట కేసీఆర్, హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఆసుపత్రి ఆవరణలో అడుగుపెట్టడం వల్ల ప్రాంతమంతా అపరిశుభ్రమైందని ఆదివారం కాంగ్రెస్ నాయకులు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
ధర్మారం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మేడారంలో ఇటీవల ప్రారంభించిన 30 పడకల ఆసుపత్రి భవనానికి రాసిన పేరు విషయంలో వివాదం ముదురుతోంది. మా ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి మంజూరు చేసి శంకుస్థాపన చేశామని బీఆర్‌ఎస్ నాయకులు శనివారం సీహెచ్‌సీ ఎదుట కేసీఆర్, హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఆసుపత్రి ఆవరణలో అడుగుపెట్టడం వల్ల ప్రాంతమంతా అపరిశుభ్రమైందని ఆదివారం కాంగ్రెస్ నాయకులు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 10న మేడారంలో ముప్పై పడకల ఆసుపత్రిని ప్రారంభించగా భవనానికి స్థలదాత పేరు రాయడం విషయంలో మూడు రోజులుగా వివాదం ముదురుతోంది. 1968లో మేడారంలో ఆసుపత్రి నిర్మాణానికి గ్రామానికి చెందిన పొనుగోటి మురళీధర్‌రావు 2 ఎకరాల స్థలాన్ని దానం చేశారు. అప్పటి నుంచి అందులో పీహెచ్‌సీ నిర్వహిస్తుండగా బీఆర్‌ఎస్ హయాంలో 2023లో సీహెచ్‌సీ నిర్మాణానికి జీవో ఇచ్చి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కాగా 2023లో శంకుస్థాపన సమయంలో స్థలదాత పేరు శిలాఫలకంపై లేదని వారి కుమారులు అభ్యంతరం చెప్పడంతో ఆ కార్యక్రమం 15 రోజులు వాయిదా పడింది. అనంతరం స్థలదాతగా పొనుగోటి మురళీధర్‌రావు పేరు పెట్టాలని ప్రభుత్వం జీవో ఇచ్చిన తరువాత శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా ప్రారంభోత్సవానికి ముందు ఆసుపత్రి భవనానికి కీ.శే.శ్రీపొనుగోటి మురళీధర్‌రావు గారి భవనం’’ అని రాయగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి పేరును తొలగించారు. దీంతో ఆసుపత్రి ప్రారంభోత్సవం రోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు రాజకీయ నాయకుల తర్జనభర్జన అనంతరం అప్పటికప్పుడు ఆర్టిస్ట్‌ను తీసుకువచ్చి స్థలదాత అనే పదాన్ని ఆడ్ చేస్తూ మురళీధర్‌రావు పేరు రాశారు. పేరు రాసేంతవరకు మంత్రి అడ్లూరి సుమారు రెండు గంటలు ధర్మారంలోని పార్టీ కార్యాలయంలో వెయిట్ చేశారు. అనంతరం మంత్రి అడ్లూరి, కలెక్టర్ కోయశ్రీ హర్ష అక్కడికి చేరుకొని ఆసుపత్రిని ప్రారంభించారు. శనివారం బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన క్షీరాభిషేకం సందర్భంగా భవనానికి ‘‘కీ.శే.శ్రీపొనుగోటి మురళీధర్‌రావు గారి భవనం’’ అని నామకరణం చేయాలని డిమాండ్ చేసింది. దీనికి సమాధానంగా కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఆసుపత్రి ఆవరణలో గోదావరి నీళ్లలో గోమూత్రం కలిపి శుద్ధి చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శంకుస్థాపన సమయంలో స్థలదాత పేరు రాయకుండా కార్యక్రమం చేపట్టి మీరే ఆయనను అవమానించారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్థలదాత అని రాసి ఉందని బీఆర్‌ఎస్ పెట్టిన శిలాఫలకంపై కూడా ‘స్థలదాత పొనుగోటి మురళీధర్‌రావు’’ అని రాసి ఉందని అందుకే అతనిని గౌరవిస్తూ మేము రాశామని కాంగ్రెస్ వాదిస్తుంది. మొత్తానికి ఆసుపత్రి ప్రారంభం నాటి నుంచి నేటి వరకు రాజకీయమంతా ఆసుపత్రి భవనం చుట్టూ తిరగడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.