కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:54 PM
ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసినందున తక్షణమే వేతనాలు, అలవెన్సులు పెంచాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జ్యోతినగర్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ ఒప్పందం గడువు ముగిసినందున తక్షణమే వేతనాలు, అలవెన్సులు పెంచాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు న్యాయం జరిగే వరకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా 4 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రామగుండం ఎన్టీపీసీ ప్రాంతాన్ని ’బి‘ గ్రేడ్‌కు మార్చాలని కోరారు. దీనివల్ల కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీపీసీ రెండో దశ యాష్‌పాండ్ కోసం రాజాపూర్, మొగల్‌పహాడ్ ప్రాంతాల్లో సేకరించనున్న సుమారు 600 ఎకరాల భూములకు సంబంధించి 2024 సర్వే ప్రకారం భూములిచ్చే రైతులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ల నియామకాల్లో బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఎన్టీపీసీ సీఎండీకి ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు ఇచ్చారని, ఇలాంటి విధానాలతో కార్మికులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న అనవసర రచ్చను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. పదేళ్లలో జరగని అభివృద్ధి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోందని, పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.500 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. త్వరలో ఈఎస్‌ఐ ఆసుత్రికి శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. ఐఎన్‌టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ బాబర్ సలీం భాషా, కాంగ్రెస్ సీనియర్ నేత గుమ్మడి కుమారస్వామి, ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నేత సందినేని గోపాలరావు, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు భూమల చెందర్ తదితరులు పాల్గొన్నారు.