కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిర్వీర్యం చేసేందుకు కుట్ర
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:10 AM
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
పెద్దపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్సిస్తున్నాయని వారు పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా వివాహ సమయంలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో కీలకంగా నిలిచాయన్నారు. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో పాటు, ఇప్పటికే మంజూరైన వాటికి కూడా ఆర్థిక సాయం అందడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. పెళ్లిళ్లు పూర్తయిన తర్వాత కూడా లబ్ధిదారులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరమైన అంశాలను సాకుగా చూపి పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న ఈ పథకాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదన్నారు. వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించకపోవడంతో అర్హులైన పలువురు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న వారికి ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని, పథకాలను కొనసాగించాలన్నారు. వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. టీఎస్‌టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, పార్టీ నాయకులు పడాల సతీష్ గౌడ్, ఉప్పురాజుకుమార్, మర్కు లక్ష్మన్, పెంచాల శ్రీధర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
అంతర్గాం, ఆగస్టు17(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు రామగుండం బీ పవర్ హైస్ వద్ద ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌశికహరి, వ్యాల్ల హరీష్ రెడ్డి, కార్పొరేటర్లు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోదావరిఖని నుంచి రామగుండం వరకు బైక్ ర్యాలీగా వచ్చి, ఆందోళనలు చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.