కాంగ్రెస్ కాంట్రాక్టుల కోసం వేధిస్తోంది
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:13 AM
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్‌టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి విస్తరిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం వేధిస్తున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు.
కోల్‌సిటీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్‌టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి విస్తరిస్తుంటే కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం వేధిస్తున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. 12ఏళ్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు దండుకుంటున్నారన్నారు. రెండు పార్టీలు సింగరేణిని అప్పుల పాలు చేశాయని, జీతాలు ఇవ్వలేని పరిస్థి తికి తీసుకువచ్చాయన్నారు. 70వేల మంది ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 37వేలకు పడిపోయిందని, కంపెనీ ఎప్పుడేమవుతుందో తెలియని భయం ఉద్యోగుల్లో ఉందన్నారు. సింగరేణికి చెందిన రూ.51వేల కోట్ల బకాయిలను ఎప్పుడు ఇస్తారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని గెలిపిస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు. ఎస్‌సీ సెల్ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు బల్మూరి వనిత, రావుల రాజేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టండి
జ్యోతినగర్, (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు తలమానికమైన సింగరేణి సం స్థను గతంలో బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ తమ జేబు సంస్థగా మార్చా యని, తమ రాజకీయ అవసరాల కోసం కోట్లాది రూపాయల కార్మికుల శ్రమను ఆ పార్టీలు దోచుకున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో జరిగిన రోడ్‌షోలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టారన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువుల కర్మాగారానికి రూ.6 వేల కోట్లు, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం కోసం రూ.11 వేల కోట్లను తమ ప్రభుత్వం ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చర్చకు వస్తే తాము సిద్దంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గోమాస శ్రీనివాస్, కందుల సంధ్యారాణితోపాటు తదితర నాయకులు పాల్గొన్నారు.