‘సర్’పై కాంగ్రెస్ దృష్టి
ABN , Publish Date - May 17 , 2026 | 01:01 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కార్యక్రమంతోపాటు సంస్థాగత నిర్మాణంపై కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన కార్యాలయంలో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కార్యక్రమంతోపాటు సంస్థాగత నిర్మాణంపై కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన కార్యాలయంలో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఫ అప్రమత్తంగా ఉండాలని సూచన
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గ ఇనచార్జిలు, కో ఆర్డినేటర్లు, గ్రామస్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులు, పార్టీనేతలు పార్టీ సానుభూతిపరులను ఓటర్ల జాబితా నుంచి తీసివేయకుండా జాగ్రత్త పడాలన్నారు. ఓటరు జాబితాలో పేరులేని వారిని గుర్తించి వారికి ఓటుహక్కు కల్పించేందుకు పేర్లను నమోదు చేయించాలని సూచించారు. గ్రామాల్లో లేరనే కారణంగా అర్హులైన ఓటర్లను తొలగించే అవకాశాలున్నాయని, ఆ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఫ సంక్షేమ పథాకాల ప్రచారంపై దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకవెళ్ళి వారికి కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల సానుకూలధృక్పథం పెరిగేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలందరూ ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందినపుడే పథకాల లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఆ దిశగా పార్టీనేతలు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని సమావేశంలో సూచించారు. ప్రభుత్వ పథకాలన్నింటిపై విస్తృత ప్రచారం కల్పించి, వాటి ప్రయోజనాలు పొందేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, చురుకైన అంకితభావంగల వారినే వివిధ పదవుల్లో నియమించడం ద్వారా మాత్రమే ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవచ్చని సమావేశం అభిప్రాయపడింది. క్షేత్రస్థాయిలో అలాంటి నాయకత్వానికి చోటు కల్పిస్తూ వివిధ కమిటీలు భర్తీ చేయాలని సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై దృష్టి సారించి రైతులకు మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు సమస్యతోపాటు గ్రామాల్లోని ఇతర సమస్యల పరిష్కారానికి పార్టీనేతలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తున్న వారికి కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్నవారికి నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతూ తీర్మానించారు. నామినేటెడ్ పదవులు మూడు సంవత్సరాలపాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కూన శ్రీశైలంగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేషన అధ్యక్షుడు వైద్యుల అంజనకుమార్, సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మున్నూరుకాపు కార్పొరేషన చైర్మన బొమ్మ శ్రీరాంచక్రవర్తి, నియోజకవర్గ ఇనచార్జిలు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ఇనచార్జి మీనాక్షి నటరాజన, టీపీసీసీ అధ్యక్షుడు మహేశకుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన సావంత, జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్న నేతలతో మాట్లాడారు. ఈసందర్భంగా వారు ఓటరుజాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఎల్‌ఏల నియామకం పూర్తి చేయాలని, పార్టీ మండల అధ్యక్షుల నియామకం వెంటనే చేసి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.