Share News

బడ్జెట్‌తో ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:25 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌ అని, తెలంగాణను తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్‌ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌, పుట్ట మధుకర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బడ్జెట్‌తో ప్రజలను మోసగించిన కాంగ్రెస్‌

పెద్దపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌ అని, తెలంగాణను తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్‌ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌ రెడ్డి, కోరుకంటి చందర్‌, పుట్ట మధుకర్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం స్కీములకూ గండికొట్టి, స్కాంలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అనేక పథకాలను క్రమంగా అటకెక్కిస్తున్నదన్నారు. రెండున్నరేండ్లలో 3.47 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పుకుంటున్న సీఎం, చేసిన పనులేమీ లేవని మండిపడ్డారు. రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు. 2023-24 ఆర్థిక సంవ త్సరంలో రాష్ట్ర సొంత పన్నుల రాబడి రూ.1,11,798 కోట్లు వచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం, 2024-25 సంవత్సరానికి రూ.1,09,233 కోట్లు వచ్చినట్టు బడ్జెట్‌లో ప్రకటించిందని, ఇది వారి పని తీరుకు నిదర్శనమన్నారు. పదేండ్లలో 16 శాతం సమ్మి ళిత వార్షిక వృద్ధిరేటుతో దేశంలోనే తెలం గాణను కేసీఆర్‌ టాప్‌లో నిలిపారని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలను పూర్తి చేయడానికి కూడా చేతులు రాలేదనీ, తులం బంగారం, మహాలక్ష్మీ కింద మహిళలకు ప్రతీనెలా రూ.2500 ఇలా ఆరు గ్యారెంటీలకు ఈసారి బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించలేదని, రూ.5,370 కోట్లు కోత విధించిందన్నారు. యువతులకు స్కూటీల పథకంపై బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించ లేదన్నారు. గృహజ్యోతి అందరికీ అందడం లేదన్నారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన 1023 గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు రేవంత్‌ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టిందన్నారు. రైతుభరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పిస్తామని ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో బీమా పథకాన్ని ప్రకటించింది. కానీ ఈ పథకం అమలుపై స్పష్టత లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు, పేల్చివేతలు అని కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌ కుమార్‌, పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్‌, నడిపెల్లి మురళీధర్‌ రావు, నారాయనదాసు మారుతీ, పూదరి చంద్ర శేఖర్‌, కె కిషోర్‌, అఫ్జల్‌ బాబా, ప్రేమ్‌ కుమార్‌, గాజుల అరుణ్‌, నేరటి శ్రీనివాస్‌ బొడ్డుపల్లి శ్రీనివాస్‌, మేడి సదానందం, దాసరి బాలరాజు, కుమార్‌ నాయక్‌, మేకల కొమురయ్య, కుమార్‌ యాదవ్‌, బి అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:25 PM