Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:56 PM

ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌ కొంత కాలంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల విమర్శ, ప్రతి విమర్శలకు వేదికైంది. గోదావరిలో నీళ్లు వృథాగా పోతున్నా కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయడం లేదని మాజీ మంతి కొప్పుల ఈశ్వర్‌ గత నెల 20న, మేడారంలోని నంది రిజర్వాయర్‌లో తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్రికెట్‌ ఆడి నిరసన తెలిపారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీ

ధర్మారం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌ కొంత కాలంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల విమర్శ, ప్రతి విమర్శలకు వేదికైంది. గోదావరిలో నీళ్లు వృథాగా పోతున్నా కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయడం లేదని మాజీ మంతి కొప్పుల ఈశ్వర్‌ గత నెల 20న, మేడారంలోని నంది రిజర్వాయర్‌లో తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్రికెట్‌ ఆడి నిరసన తెలిపారు. మరుసటి రోజు మంత్రి అడ్లూరి బీఆర్‌ఎస్‌ పార్టీ, కొప్పుల ఈశ్వర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దొరల ప్రాంతానికి కాళేశ్వరం తరలివెళ్తుంటే సొంత నియోజకవర్గానికి కొప్పుల ఈశ్వర్‌ చుక్క నీరివ్వలేదని ఆహ్రగం వ్యక్తం చేశారు. అనంతరం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురవడం, గోదావరికి వరద పోటేత్తి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిండడంతో, అధికారులు ఎల్లంపల్లి జలాలను మిడ్‌ మానేర్‌కు ఎత్తిపోసే ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో మరో సారీ రెండు పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. వారం రోజులుగా కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్న నంది పంపుహౌస్‌ను ఆదివారం బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించారు. కాళేశ్వరం జలాలతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందనే విషయం కాంగ్రెస్‌ నాయకులకు తెలియదని, వారికి అవగాహన కల్పించేందుకే యాత్ర చేపట్టినట్లు బీఆర్‌ఎస్‌ ఎద్దేవా చేసింది. అనంతరం సోమవారం ధర్మపురి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు ధర్మారం తరలివచ్చారు. ఏడు మండలాల నాయకులు కాన్వాయ్‌తో నంది పంప్‌ హౌస్‌ వరకు తరలివెళ్లారు. ఎల్లంపల్లి జలాల వద్ద ముఖ్యమంత్రితో పాటు మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులు మీడియాతో మాట్లాడారు. కరువు వచ్చి కాంగ్రెస్‌ను తిట్టాలనుకున్న బీఆర్‌ఎస్‌ ఎత్తుగడలను వరుణయాగం చిత్తు చేసిందని డీసీసీ జనరల్‌ సెక్రెటరీ గాగిరెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కట్టించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచే ఎత్తిపోస్తున్న జలాలని, ఇవి కాళేశ్వరం నీళ్ళు కావన్నారు. పెద్ద ప్రాజెక్ట్‌ కట్టినం, పంప్‌హౌస్‌లు నిర్మించినమని గొప్పలు చెప్పుకునే కొప్పుల ఈశ్వర్‌ అర ఎకరాకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేక పోయావో చెప్పాలని ప్రశ్నించారు.

Updated Date - Aug 03 , 2026 | 11:56 PM