ఆశావహుల్లో అయోమయం..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:26 AM
ఎన్నికలు ఏవైనా సోషల్ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఎన్నికల నిర్వహణ కోసం కీలకమైన ఓటర్ జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఎన్నికలు ఏవైనా సోషల్ మీడియా హడావుడి అంతా ఇంతా కాదు. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి మాసంలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఎన్నికల నిర్వహణ కోసం కీలకమైన ఓటర్ జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించి క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టారు. ఒకవైపు రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుండగా, సోషల్ మీడియాలో మాత్రం ఏకంగా ఎన్నికల తేదీల షెడ్యూల్ చక్కర్లు కొట్టడంతో ఆశావహులు ఆయా పార్టీల చుట్టూ, వార్డుల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకోవడానికి పరుగులు తీస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో పార్టీలు, ఆశావహుల మధ్య పోస్టుల మాటల యుద్ధం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు ఉండగా, 67 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించే అవకాశాలు కనిపిస్తుండగా, సోషల్ మీడియాలో మాత్రం జనవరి 16న షెడ్యూల్ విడుదల,18,19,20 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 23న ఉపసంహరణ, 24న గుర్తుల కేటాయింపు, ఫిబ్రవరి 1న ప్రచారం ముగింపు, 3న పోలింగ్, 6న కౌంటింగ్ అంటూ షెడ్యూల్ చక్కర్లు కొడుతోంది. గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ దృష్టిలో పెట్టుకొని పెడుతున్న తేదీల ఖరారు అందరినీ అయోమయానికి గురిచేస్తోంది. ఎన్నికల కమిషన్ మాత్రం అధికారికంగా జనవరి 12న తుది ఓటర్ జాబితా వెల్లడించనుంది. 13న పోలీస్ స్టేషన్లో వివరాల ముసాయిదా ప్రచురించడంతో పాటు టీ-పోల్‌లో అప్లోడ్ చేయాలి. 16న పోలీస్ స్టేషన్లో వివరాలతో పాటు ఓటర్ల తుది జాబితాను వార్డులోని పోలీస్ స్టేషన్లో ప్రచురించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ క్రమ పద్ధతిలో ముందుకు సాగుతుండగా సోషల్ మీడియాలో ముందుగానే షెడ్యూల్ తేదీలు ప్రచారం కావడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది.
ఎన్నికల ఏర్పాట్లలో యంత్రాంగం
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో 67 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాటు చేస్తోంది. తుది ఓటర్ జాబితా ప్రచురించడానికి సిద్ధం చేస్తూనే, ఫొటోతో కూడిన ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారిగా ప్రకటించడంతోపాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసుకోవడం, సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టారు. 600 మంది ఓటర్లు మించకుండా ఒక పోలింగ్ కేంద్రం చొప్పున వార్డుకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బంది వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సిరిసిల్ల వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో 67 వార్డులు ఉండగా, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం 122836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 59522 మంది, మహిళలు 63290 మంది, జెండర్లు 24 మంది ఉన్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. పురుషుల కంటే 3768 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా, 81959మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 39942 మంది, మహిళలు 42011 మంది, జెండర్లు ఆరుగురు ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40877మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19580 మంది, మహిళలు 21279 మంది, జెండర్లు 18మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1699 మంది ఎక్కువగా ఉన్నారు.
పార్టీలో పెరిగిన సందడి..
మునిసిపల్ ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకునే దిశగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహంతో సందడి మొదలైంది. జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు, వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా గడిచిన పాలకవర్గాల పగ్గాలు బీఆర్‌ఎస్ దక్కించుకుంది. ఈసారి సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో పట్టు సాధించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఉంది. బీఆర్‌ఎస్ తిరిగి గులాబీ జెండానే ఎగురవేయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇటీవల ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన ఆధిపత్యాన్ని పదిలపరుచుకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ఆనవాయితీని నిలుపాలని భావిస్తోంది. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పాలక పగ్గాలు చేపట్టాలని అభ్యర్థుల ఎంపికవైపు దృష్టి పెట్టింది. తనదైన శైలిలో సిరిసిల్ల, వేములవాడ పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న ఆదరణను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని భావిస్తోంది. వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ కార్మిక వాడల్లో అభ్యర్థులను బరిలో నిలిపి విజయం సాధించాలనే తాపత్రయంతో ఉంది. ఆశావహులు మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ పొందగలిగితే సగం విజయం సాధించినట్లుగా భావిస్తున్నారు. ఇందుకోసం ఆయా పార్టీలో టికెట్ల కోసం ఆశావహులు నానా తంటాలు పడుతున్నారు.