పూర్తయిన రహదారి నిర్మాణం
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:53 PM
దశాబ్దాల కాలంగా సరైన ప్రయాణ వసతి లేక ఇబ్బందులు పడుతున్న రాయపేట గ్రామానికి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి అబ్బిడిపల్లి, రాయపేట మీదుగా పందిళ్ల వరకు బీటి రహదారి నిర్మాణం పూర్తయ్యింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు చిత్రపటాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు.
కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): దశాబ్దాల కాలంగా సరైన ప్రయాణ వసతి లేక ఇబ్బందులు పడుతున్న రాయపేట గ్రామానికి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి అబ్బిడిపల్లి, రాయపేట మీదుగా పందిళ్ల వరకు బీటి రహదారి నిర్మాణం పూర్తయ్యింది. ఈ సందర్భంగా సర్పంచ్ మ్యాకల లావణ్య జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు చిత్రపటాలకు ఆదివారం మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, ప్రజలు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. మాజీ ఎంపీపీ మాట్లాడుతూ కాల్వశ్రీరాంపూర్, పందిళ్ల ద్వారా రాయపేట నుంచి ఓదెల దేవస్థానం వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మల్లికార్జునస్వామి ఆలయం నుండి పోచంపల్లి వరకు రూ.10.70 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణరావు చొరవతో తమ గ్రామ రూపురేఖలు మారుతున్నాయ న్నారు. హనుమాన్ ఆలయం నుంచి లక్ష్మిపురం వరకు రహదారి నిర్మిస్తే, గ్రామపంచాయతీకి వెళ్లే మార్గం నాలుగు నుండి రెండు కిలోమీటర్ల వరకు తగ్గి, లక్ష్మిపూర్, రాయపేట రైతులకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. సాలగిద్ద కుంట నుండి అయిలగిద్ద కుంట వరకు రాకపోకలకు వీలుగా మెటల్ రోడ్డు వేయాలని కోరారు. పందిళ్ల మెయిన్ రోడ్డు వద్ద రాయపేట గ్రామ స్వాగత తోరణాన్ని నిర్మించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ఉపసర్పంచ్ జంగిలి తిరుపతి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు బంగారి రమేష్, ఆరెల్లి రమేష్, కొమురయ్య, జిన్నా రామచంద్రరెడ్డి, పోశాల శైలజ సదానందం, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ ఎంపీటీసీ రావి సదానందం, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.