పోటాపోటీగా ప్రచారం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:34 AM
మున్సిపల్ ఎన్నికల్లో ప్రచా రానికి సోమవారం చివరి రోజు కావడంతో 13 వార్డుల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.
మంథని, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రచా రానికి సోమవారం చివరి రోజు కావడంతో 13 వార్డుల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీపీ సీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజలు పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని హామీలు ఇచ్చి ఓటర్లుకు విజ్జప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీపాదచౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మంథని మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేసి అన్ని వార్డుల్లో అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలందరికి అందిస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, విద్యా, వైద్యానికి , మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తన ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచిన వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. మున్సిపల్‌లో జరిగే అవినీతిని అడ్డుకోవటానికి తమ పార్టీ అభ్యర్థులు కాపలా ఉంటారని, వారిని గెలిపించాలని కోరారు. అన్ని వార్డుల్లో అభ్యర్థులు, వారి పార్టీ అధినేతలు, అనుచరుల పర్యటనలు, ప్రచారాల హోరు వార్డుల్లో ఎన్నికల సందడి కనిపిస్తుంది.