రావయ్యా గణపయ్యా..
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:30 AM
ఆది దేవుడు.. లంభోదరుడు.. గణపయ్య.. గణేషుడు... ఇలా అనేక పేర్లు తీరొక్క రూపాలతో భక్తకోటికి ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఆది దేవుడు.. లంభోదరుడు.. గణపయ్య.. గణేషుడు... ఇలా అనేక పేర్లు తీరొక్క రూపాలతో భక్తకోటికి ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. తొలిపూజలు అందుకునే గణపయ్యను కొలువు తీరేలా సర్వాంగ సుందరంగా మండపాలను సిద్ధం చేశారు. పట్టణాల నుంచి పల్లెల వరకు... చౌరస్తాల నుంచి గల్లీల వరకు తొమ్మిది రోజుల పాటు వినాయక సంబురాలతో భక్తులు తన్మయత్వం చెందనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే వినాయక సందడికి పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందుకు రావడంతో ఆశావహుల సహకారంతో మరింత ఉత్సాహంగా యువకులు వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. నిర్వాహకులు ఉత్సవాల కోసం ఖరీదైన మండపాలు, భారీ విగ్రహాలను ప్రతిష్టించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. విఘ్నాలు తొలగించే వాడిగా ఏ పని మొదలు పెట్టినా విఘ్నేశ్వరున్ని ధ్యానించడంతోనే మొదలయ్యే సంప్రాదాయం భూలోకంలేనే కాదు.. దేవలోకంలోనూ ఉంది. వేదాలకు అది స్వరూపమైన ఓంకార రూపమే గణపతిగా భావిస్తారు. పంచభూతాలకు సంకేతంగా వినాయకుడు పూజలు అందుకుంటాడు. దక్షిణాయానంలో తొలి పండుగగా వినాయక చవితిని అన్ని కులాలు, ఉత్సవాలను జరుపుకుంటారు.
బొజ్జ గణపయ్య ఖర్చు రూ 20 కోట్ల పైనే..
జిల్లా వ్యాప్తంగా లంభోదరుడికి స్వాగతం పలకడానికి, ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి బొజ్జ గణపయ్య ఖర్చు భారీగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఐదు వేలకు పైగా భారీ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం రూ 20 కోట్ల పైగానే నిర్వాహకులు ఖర్చు చేయనున్నారు. సిరిసిల్ల, వేములవాడలోనే 3 వేల విగ్రహాల వరకు ప్రతిష్టిస్తే ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది వరకు ప్రతిష్టిస్తారు. విగ్రహాల కోసం సంఘాలు రూ 50 వేల నుంచి 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మండపాల కోసం అదనపు ఖర్చు కూడా ఉంటుంది. మహారాష్ట్ర, నాందేడ్‌తో పాటు హైదరాబాద్, కోరుట్ల ప్రాంతాల నుంచి విగ్రహాలను తీసుకవస్తున్నారు. మట్టి విగ్రహాలను కూడా ఏర్పాటుకు పూనుకున్నారు. ఈసారి 30 శాతం వరకు ధరలు కూడా పెరిగాయి. మార్కెట్‌లో ఇళ్లలో పూజలు నిర్వహించుకోవడానికి చిన్న విగ్రహాల అమ్మకాలు కూడా మొదలయ్యాయి. వివిధ ఆకృతుల్లో ఉండే విగ్రహాలు రూ 300 నుంచి రూ 2 వేల వరకు ధర పలుకుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశాయి. జిల్లా కేంద్రంలో భారీ విగ్రహాలతో పాటు విభిన్నం ఉన్న విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. సిరిసిల్లలో రామలాల్ మండపంలో వెండి గణపతులతో పెద్ద గణపతిని రూపొందించారు. ఇందులో 2026 చిన్న వెండి విగ్రహాలు ఉపయోగించారు.
జిల్లా కేంద్రంలో లంబోదరుడి సందడి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఆహ్వానిస్తూ ఒక రోజు ముందుగానే సందడి మొదలైంది. ఆదివారం వినాయక మండపాల నిర్వాహకులు సిరిసిల్ల కేంద్రానికి వచ్చి భారీ విగ్రహాలను తీసుకెళ్లడంతో పండుగ హడావుడి మొదలైంది. మరోవైపు ఇళ్లలో వినాయక పూజ కోసం విగ్రహాల కొనుగోలు మొదలుపెట్టారు. ఇందుకోసం వ్యాపారులు రోడ్లపై ప్రత్యేక విక్రయాలు ప్రారంభించారు. చిన్న విగ్రహాలు విభిన్న రూపాల్లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతోపాటు పూజకు కావలసిన సామగ్రి కూడా అమ్మకాలు మొదలయ్యాయి. రెండు రోజుల ముందు నుంచే మట్టి విగ్రహాలను వివిధ సంస్థలు ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.
పూజకు ఇలా సిద్ధం కావాలి..
- చవితి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పట్టు వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించాలి.
- గడపలకు పసుపు, కుంకుమలు, గుమ్మాలకు మంగళ తోరణాలు కట్టాలి.
- మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేసుకొని పూజకు సిద్ధం చేసుకోవాలి.
- వినాయకుని పూజ కోసం 21పత్రులను సిద్ధం చేసుకోవాలి. వాటితోపాటు పసుపు, కుంకుమ, అగర్‌వత్తులు, హారతి కర్పూరం, అక్షింతలు, దీప స్తంభాలు, కందులు, వత్తులు, నూనె లేక నెయ్యి, పంచామృతాలు, తమలపాకులు, వక్కలు, పూజ పుష్పాలు, పండ్లు, పత్రి, వ్రతం, యజ్ఞోపవితం, గంధం, పంచపాత్ర, ఉద్దరీన, పల్లెములు, హారతి పల్లెం, కొబ్బరికాయలు, జెగంట, పాలవెల్లి, గొడుగు, నైవేద్యం సామగ్రి, పిండివంటలు సిద్ధం చేసుకోవాలి.
- ఇంటిలోనే ఈశన్య ప్రాంతంలో తూర్పు ముఖంగా శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టాలి. వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగించే పీఠాన్ని లేదా మండపాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించాలి.
- మండపంలో అష్టదళ పద్మముగ్గు వేయాలి. వెదురు కర్రలతో పాలవిల్లి తయారు చేసి, వెలగ, మారేడు, మొక్కజొన్న కంకులు, జామ పండ్లు, అరటిపండ్లు, మామిడి ఆకులు, పూలతో పాలవిల్లిని అలంకరించాలి.
- అష్టదళ పద్మంలో బియ్యం పోసి వినాయకున్ని ప్రతిష్టించాలి. దీపాన్ని వెలిగించాలి. అక్షింతలు ఉంచి కలశ పూజ చేయాలి. పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి పూజ చేయాలి.
- లోహవిగ్రహాలు ఉన్నా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న సామాగ్రితో పూజ నిర్వహించాలి.
వక్రతుండాయ.. వైవిధ్య రూపాయ..
- ఆరోగ్యానికి సంరక్షణ.... 21 పత్రాల పూజ విశిష్టత
అనేక రూపాల్లో కొలువుదీరే వినాయకుడిని పూజించడానికి, ఉత్సవాలు జరుపుకోవడానికి పోటీ పడతారు. భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడం యువకులు ట్రెండుగా మార్చుకున్నారు. అన్ని విఘ్నాలను తొలగించే గణపతిని ముందుగా పూజించనివారు ఉండరు. ఏ శుభ కార్యక్రమమైనా శుక్లాం భరధరంతోనే మొదలవుతుంది. అలాంటి ఏకదంతుడి పండుగంటే అందరికి సంబరమే.. గణపతికి పిల్లలు, పెద్దలు ఎంతో నిష్టగా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వినాయకునికి ఇష్టమైన 21 ఆకుల్లో ఉన్న శాస్త్రీయతను గమనిస్తే.. సామాజిక, ఆరోగ్య పరిరక్షణ కూడా కనిపిస్తుంది. పత్రిల వారిగా చూస్తే... మాచిపత్రం చర్మవ్యాధులను నివారించి, కేశవృద్ధి కలిగిస్తుంది. చెవిపోటు, కఫ వ్యాధులు తగ్గుతాయి. పెద వాకుడాకు దంతశూల, శ్వాస రోగాలను నివారిస్తుంది. మారేడు ఆకు అతిసారం, కలర, విరోచనాలు, అతిమూత్రాన్ని తగ్గిస్తుంది. గరిక ఆకు మూత్రకోశ వ్యాధులను, మూత్రాశయంలో రాళ్లను కరిగించి గర్భాశయ రోగాలను తగ్గిస్తుంది. ఉమ్మెత్త ఆకు మానసిక రోగాలను,మెదడువాపు, విషజ్వరాలు, ఉబ్బసంవ్యాధి, పుండ్లను తగ్గిస్తుంది. రేగు ఆకు రక్తస్రావాన్ని అరికట్టి.. వడదెబ్బ, అరుచి, దాహంల నుండి కాపాడుతుంది. ఉత్తరేణి ఆకు రక్తపు గడ్డలను కరిగిస్తుంది. మూత్రాశ రోగాలను నివారిస్తుంది. తులసి ఆకు కఫ, చర్మ రోగాలను, స్త్రీ, పురుష జననేంద్రియ సమస్యలను తొలగిస్తుంది. మామిడి ఆకు స్త్రీ జననేంద్రియ, మధుమేహంను నివారించి, రక్తవృద్ధి కలిగిస్తుంది. గన్నేరు ఆకు వివిధ జ్వరాలను తగ్గిస్తుంది. విష్ణుకాంత ఆకు జ్వరాలు, స్త్రీ, పురుషు జననేంద్రియ వ్యాధులు నివారిస్తుంది. దానిమ్మ ఆకు జీర్ణాశయ క్రిములను నివారిస్తుంది. విరోచనాలను తగ్గిస్తుంది. దేవదారు ఆకు చర్మ వ్యాధులను, కీళ్ల వాతలను తగ్గిస్తుంది. మరువ ఆకు సుగంధ ద్రవ్యం, కేశ వృద్ధి కలిగించి.. చుండ్రును నివారిస్తుంది. వావిలి ఆకు పక్షవాతాన్ని, ఇతర వ్యాధులను తగ్గిస్తుంది. జాపత్రి ఆకు సుగంధ ద్రవ్యం, పురుష లైంగిక వ్యాధులను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది. ఏనుగు చెవి (అడవి మల్లె) ఆకు నేత్ర, చర్మవ్యాధులను నివారిస్తుంది. జమ్మి ఆకు అతి మూత్రాన్ని నివారిస్తుంది. రావి ఆకు మధుమేహ నివారణకు తోడ్పడుతుంది. అర్జున పత్రం (తెల్లమద్ది) గుండెజబ్బుల నివారణ, రక్తపోటును తగ్గిస్తుంది. జిల్లెడు ఆకు పక్షవాతం, విషజ్వరాలను, చర్మ రోగాలు, కీళ్ల వాతాన్ని తగ్గిస్తుంది.
ఉత్సవాలపై పోలీస్ నజర్
జిల్లాలో వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. రాత్రి పది గంటల తరువాత సౌండ్ సిస్టమ్‌ను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. మండపాల వివరాలను ఇప్పటికే సేకరించారు. వినాయక ఉత్సవాల ప్రారంభం నుంచి చివరి వరకు ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. ఇప్పటికే నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. పలు సూచనలు చేశారు. నిమజ్జనం రోజు కూడా క్రమపద్ధతిలో వెళ్లడానికి ముందుగానే సీరియల్ నంబర్లను కేటాయిస్తున్నారు. సంప్రాదాయ పద్ధతిలో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవడానికి పలు సూచనలు చేశారు.