Share News

చలి పంజా..

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:41 PM

జిల్లాలో చలి పంజా విసురుతోంది. మూడు రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుం టున్నాయి. పగటిపూట ఎండ తీవ్రత పెద్దగా లేకపోయినా సాయంత్రం కాగానే చలి మొదలవుతోంది. రాత్రి వేళల్లో చలి తీవ్రత మరింత పెరుగు తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

చలి పంజా..

పెద్దపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చలి పంజా విసురుతోంది. మూడు రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుం టున్నాయి. పగటిపూట ఎండ తీవ్రత పెద్దగా లేకపోయినా సాయంత్రం కాగానే చలి మొదలవుతోంది. రాత్రి వేళల్లో చలి తీవ్రత మరింత పెరుగు తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రిపూట కూలర్లు, ఏసీలను వినియోగించడం లేదు. మరోవైపు చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు, దుప్పట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లలో ఉన్ని దుస్తులకు గిరాకీ పెరుగుతోంది.

సాయంత్రం నుంచే చలి పులి!

జిల్లాలో చలి ప్రభావం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పట్టణాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచే చల్లటి గాలులు వీస్తుండటంతో రోడ్లపై జనసంచారం తగ్గుతోంది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. శనివారం జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీల వరకు ఉండవచ్చని సూచించగా, రానున్న రోజుల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

ఉన్ని దుస్తుల దుకాణాలకు గిరాకీ

చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తుల విక్రయాలు కొనసాగుతున్నాయి. సీజనల్‌ వారీగా దుకాణాలను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. రాత్రివేళల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు చలి నుంచి రక్షణ కోసం జర్కిన్లు, చేతి గ్లౌజులు వినియోగిస్తున్నారు. గ్రామాల్లోనూ ఉదయం, రాత్రి వేళల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించడంతోపాటు చలిమంటలు వేసుకుంటున్నారు.

వృద్ధులు.. చిన్నారులు జాగ్రత్త

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు చల్లటి గాలికి ఎక్కువగా గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లేవారు చలి తగ్గిన తర్వాతే వెళ్ళాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఉదయం, రాత్రి వేళల్లో తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలి.

చిన్నారులు, వృద్ధులను చల్లటి గాలులకు దూరంగా ఉంచాలి.

గోరువెచ్చని నీటిని తాగాలి.

ఆస్తమా, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

తెల్లవారుజామున పొగమంచు, చల్లటి గాలులు ఉన్నప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలి.

చలి మరింత పెరుగుతుందా?

జిల్లాలో రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు ఉంటోంది. ఈనెల 20 వరకు రాష్ట్రంలో చలి ఉండే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో ఈనెల 18 తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

Updated Date - Nov 14 , 2026 | 11:41 PM