Share News

గ్రామపాలనలో గందరగోళం

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:12 AM

గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా విభజించి.. అందుకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులను కేటాయించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏ పంచాయతీకి ఏ స్థాయి కార్యదర్శి ఉండాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామపాలనలో గందరగోళం నెలకొంటున్నది.

గ్రామపాలనలో గందరగోళం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన గ్రేడ్లుగా విభజించి.. అందుకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులను కేటాయించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏ పంచాయతీకి ఏ స్థాయి కార్యదర్శి ఉండాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో గ్రామపాలనలో గందరగోళం నెలకొంటున్నది. మరోవైపు జనాభా ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తుండగా.. తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు సీనియర్‌ గ్రేడ్‌ కార్యదర్శులు పని చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన పంచా యతీలకు గ్రేడింగ్‌ చేస్తామని ప్రభుత్వం ఆరు నెలల క్రితమే వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన కార్యా చరణ చేపట్టకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతున్నది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తదితర బాధ్యత లన్నీ కార్యదర్శులపైనే ఉండటంతో అధిక జనాభా ఉన్న పంచా యతీల్లో పని ఒత్తిడి మరింత పెరుగుతున్నది.

జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు

నిబంధనల ప్రకారం 5 వేలకుపైగా జనాభా ఉన్న పం చాయతీలను గ్రేడ్‌ 1 పంచాయతీ, 3 వేల నుంచి 5 వేల వరకు గ్రేడ్‌ 2 పంచాయతీలుగా, 2 వేల నుంచి 3 వేల వరకు గ్రేడ్‌ 3 పంచాయతీలుగా, వెయ్యి నుంచి 2 వేల వరకు గ్రేడ్‌ 4 పం చాయతీలుగా విభజించాల్సి ఉంటుంది. అయితే క్ష్షేత్రస్థాయిలో ఈ జనాభా నిష్పత్తికి అనుగుణంగా కార్యదర్శుల కేటాయింపు జరగడం లేదు. దీంతో అధిక జనాభా ఉన్న పంచాయతీల్లో తక్కువ గ్రేడ్‌ కార్యదర్శులు పనిచేస్తుండగా, మరోవైపు తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు సీనియర్‌ గ్రేడ్‌ కార్యదర్శులు ఉండే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 263 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రతీ పంచాయతీకి కార్యదర్శి ఉన్నట్లు అధికారికంగా చెబుతున్నారు. వీరిలో గ్రేడ్‌ 1 కార్యదర్శులు 8 మంది, గ్రేడ్‌ 2 ముగ్గురు, గ్రేడ్‌ 4 కార్యదర్శులు 172 మంది, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 21 మంది, ఔట్‌సోర్సింగ్‌ కార్యదర్శులు 30 మంది, ఐదుగురు ఇతరులు ఉన్నారు. ఒక్కో కార్యదర్శికి ఒక్కో గ్రామ పంచాయతీ బాధ్యతలు అప్పగించి విధులు నిర్వహిస్తున్నారు. అయితే కార్యదర్శుల గ్రేడ్‌, సీనియా రిటీ, అనుభవం, పంచాయతీ జనాభా తదితర అంశాలను సమ న్వయం చేసి పోస్టింగులు ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తు తున్నాయి. ముఖ్యంగా బదిలీల సమయంలో కౌన్సెలింగ్‌ ఆధారంగా పోస్టింగులు ఇవ్వడం వల్ల కార్యదర్శుల గ్రేడ్‌కు, వారు పనిచేసే పంచాయతీ స్థాయికి పొంతన లేకుండా పోతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రేడు 1 పంచాయతీల్లో గ్రేడ్‌ 4 సెక్రటరీలూ

జిల్లాలో సుమారు 30నుంచి 40 వరకు అధిక జనాభా కలిగిన పంచాయతీలు గ్రేడ్‌ 1 కేటగిరీకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, వాటిలో పలుచోట్ల గ్రేడ్‌ 4 కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద పంచాయతీల్లో పని భారం అధికంగా ఉండటంతో కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒకే కార్యదర్శి అన్ని రకాల పరిపాలనా, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి రావడంతో పనులు సకాలంలో పూర్తి చేయడం కష్టంగా మారుతున్నది.

ప్రజలకు తప్పని తిప్పలు

గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన గ్రేడింగ్‌ చేసి, అందుకు అనుగుణంగా కార్యదర్శులను నియమిస్తేనే పరిపాలన మెరుగుపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తు తం అధిక జనాభా ఉన్న పంచాయతీల్లో పని భారం పెరగడంతో ధ్రువపత్రాలు, పన్నుల వ్యవహారాలు, పారిశుధ్యం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక అంశాల్లో జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా ప్రతిపాదనలకే పరిమితం కాకుండా జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడింగ్‌ పూర్తి చేసి ఆ మేరకు కార్యదర్శుల కేటాయింపులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:12 AM