Share News

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:54 AM

ప్రజా పాలనకు వెయ్యి రోజులు దాటిన సందర్భంగా చలో సిరిసిల్ల పేరిట తలపెట్టిన సీఎం భారీ బహిరంగ సభ విజయవంతం కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌గా మారింది. ఈనెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర, లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా బహిరంగ సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రజా పాలనకు వెయ్యి రోజులు దాటిన సందర్భంగా చలో సిరిసిల్ల పేరిట తలపెట్టిన సీఎం భారీ బహిరంగ సభ విజయవంతం కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌గా మారింది. ఈనెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర, లక్ష మంది జన సమీకరణ లక్ష్యంగా బహిరంగ సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. జిల్లాలోని మండలాల వారీగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సన్నాహక సమావేశాలతో సమయత్వం చేస్తుండడంతో పార్టీ నేతల్లో సందడిగా మారింది. మరోవైపు సిరిసిల్లలోని మొదటి బైపాస్‌ రోడ్డులో ఖాళీ స్థలాన్ని సభ నిర్వహణకు అనుకూలంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం సభ ఏర్పాట్లను, సన్నాహక సమావేశాన్ని వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, పశుసంవర్ధక, క్రీడా యోజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, విజయరమణారావులు పరిశీలించారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, మహేష్‌ బీ గీతెలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి సభను లక్ష మందితో నిర్వహించడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జన సమీకరణ కోసం వెయ్యి బస్సులను ఉపయోగించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా మీదుగా చేనేత చౌక్‌ నుంచి రగుడు సమీపంలోని బహిరంగ సభ స్థలం వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్రలో సిరిసిల్ల, కోనరావుపేట నుంచి రెండు వేల మందికి పైగా పాదయాత్రలో పాల్గొనే విధంగా కసరత్తు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ సభపై ప్రజల్లో ఉత్కంఠ..

సిరిసిల్లలో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే కాంగ్రెస్‌ సభపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ బలమైన ప్రాబల్యంతో సిరిసిల్ల నియోజకవర్గ ఉండడమే కాకుండా ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డపై కాంగ్రెస్‌ సభ నిర్వహించనుండడంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. జిల్లాలో జోరుగా సాగుతున్న కాంగ్రెస్‌ జన సమీకరణ సన్నాహక సమావేశాలు కాంగ్రెస్‌ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. మరోవైపు శాసనసభ వేదికగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు జరిగిన విషయాన్ని ప్రస్తావించడమే కాకుండా సిరిసిల్ల నియోజకవర్గంలోని భూములపై కూడా విచారణకు ఆదేశించారు. నాస్కోప్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు ముఖ్యమంత్రికి లీగల్‌ నోటీసు పంపడం కూడా చర్చగా మారింది. ఈక్రమంలో సిరిసిల్లలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించి గులాబీ గడ్డపై కాంగ్రెస్‌ ప్రాబల్యాన్ని పెంచే దిశగా ప్రసంగం ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తోడు అక్రమాలపై ఎలాంటి వ్యాఖ్యలు అని ఆసక్తి కూడా నెలకొంది. రాబోయే రోజుల్లో సిరిసిల్లలో కాంగ్రెస్‌ బాగా వేసే దిశగానే బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మీద ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులు చేపట్టే దిశగా ఏర్పాటు చేస్తున్నారు. రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మంజూరు చేయడంతో మరిన్ని నిధులు రాబోతున్నాయని భావిస్తున్నారు. అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్‌ సభ జిల్లా రాజకీయాల్లో మార్పులు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జరుగుతోంది.

Updated Date - Sep 27 , 2026 | 12:54 AM