Share News

మంథనిలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:10 AM

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాల విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడానికి, రోజు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం మంథనిలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేస్తోంది.

మంథనిలో  సెంట్రలైజ్డ్‌ కిచెన్‌

మంథని, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాల విద్యార్థుల డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడానికి, రోజు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం మంథనిలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, హరే కృష్ణ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలోని 19 మండలాల్లో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, ఆప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్స్‌, జూనియర్‌ కళాశాలల్లో చదువుకుంటున్న 40,052 మంది విద్యార్థినీ, విద్యార్థులకు నిత్యం టిఫిన్లు అందించనున్నారు. గంట సమయంలో వేలాది మందికి సరిపడా ఆహారాన్ని తయారు చేసే సామర్ధ్యం కల్గిన అధునాతన ఆటోమెటిక్‌ కుక్కింగ్‌ మిషన్ల కిచెన్‌లో ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహ నాల్లో టిఫిన్లను నిత్యం పాఠశాలలు, కళాశాలలకు ఉదయం సరఫరా చేయటానికి ఏర్పాట్లుచేశారు. రోజు ఒక టిఫిన్‌ను విద్యార్థులకు అందిం చడానికి ప్రత్యేక మెనూ రూపొందించారు. విద్యార్థుల ఆరోగ్యానికి ఉప యోగపడే సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటుకు సింగరేణి నిధులు కేటాయించింది. మంథనిలో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కృషి చేశారు. ఈనెల 24న ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, హెచ్‌కేఎంసీఎఫ్‌ ప్రెసిడెంట్‌ సత్యగౌరచంద్ర దాసల చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాటు చేస్తున్నారు.

మూడు నియోజకవర్గాలు.. 19 మండలాలకు సరఫరా..

పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లోని 19 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు రోజూ టిఫిన్లు సరఫరా చేయనున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని, కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తారం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఓదెల, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల తోపాటు భూపాలపల్లి జిల్లాలో ఉన్న మంథని నియోజకవర్గంలోని కాటారం, మహదేవపూర్‌, మల్హర్‌, ముత్తారం, పలిమెల మండలాలకు వాహనాల్లో టిఫిన్లు సరఫరా చేయనున్నారు.

రెండు జిల్లాల్లో 40 వేల విద్యార్థులకు లబ్ధి..

రెండు జిల్లాలోని 694 ప్రభుత్వ పాఠశాలలు, 17 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుకుంటున్న 40,052 మంది విద్యార్థులు లబ్ధి పొందను న్నారు. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు నిత్యం ఉదయం వేళల్లో టిఫిన్లు అందించనున్నారు.

సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లో సదుపాయాలు..

మంథని మార్కెట్‌ యార్డులో 8 వేల చదరపు అడుగుల స్థలంలో భారీ షెడ్‌ నిర్మించారు. ఇందులో సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌, మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించే ఫుడ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు.

కిచెన్‌లో అధునాతన యంత్రాల సామర్థ్యం..

గంటలో 5,400 ఇడ్లీ తయారు చేసే ఆటోమెటెడ్‌ స్టీమర్లు.

గంటలో 2 వేల దోశలు తయారు చేసే ఆటోమెటెడ్‌ దోశ మిషన్‌.

గంటలో 3 వేల పూరీ తయారు చేసే ఆటోమెటెడ్‌ మిషన్‌.

రెండు గంటల్లో 5 వేల మందికి సరిపడా సాంబార్‌, కూరలు సిద్ధం చేసే పాత్రలు.

కేవలం 15 నిమిషాల్లోనే వేయ్యి మందికి సరిపడ అన్నం రెడీ చేసే రైస్‌ కుకింగ్‌ మిషన్లు.

ఆటోమెటిక్‌ వెజిటెబుల్‌ వాషింగ్‌, కటింగ్‌ మిషన్లు, మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, సెంట్రల్‌ గ్యాస్‌ బ్యాంక్‌, వ్యర్థనీటి శుద్ధి ప్లాంట్‌ (ఈటీపీ), వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ తయారు చేసే విధానం ఏర్పాటు.

రేపు మంత్రి శ్రీధర్‌బాబుచే ప్రారంభం

మంథని, (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల, కళాశాల విద్యార్థులకు టిఫిన్‌ సౌకర్యం కల్పించడానికి మం థనిలో ఏర్పాటు చేస్తున్న సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వెల్లడించారు. గంగాపురి వద్ద ఇస్కాన్‌ సంస్థ, హరే రామ హరే కృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కిచెన్‌ను కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. వంటశాల, ఆహార తయారీ, నిల్వ, తాగునీరు, విద్యుత్‌, పరిశుభ్రత సౌకర్యాలను తనిఖీ చేశారు. కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్డీవో సురేష్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌ రెడ్డి, కమిషనర్‌ మనోహర్‌, తహసీల్దార్‌ ఆరిఫోద్దిన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:10 AM