జిల్లాలో కేంద్ర బలగాల సెంటర్లు
ABN , Publish Date - May 24 , 2026 | 12:30 AM
జిల్లాలో అసోం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మూడు సంస్థల గ్రూప్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల్లో 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తు రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. చొప్పదండి మండలం లోని రుక్మాపూర్ గ్రామంలో అసోం రైఫిల్స్ సెంటర్ ఏర్పాటు కానున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో అసోం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మూడు సంస్థల గ్రూప్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల్లో 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తు రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. చొప్పదండి మండలం లోని రుక్మాపూర్ గ్రామంలో అసోం రైఫిల్స్ సెంటర్ ఏర్పాటు కానున్నది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం ఐదెకరాల స్థలాన్ని కేబినెట్ కేటాయించింది. గన్నేరు మండల కేంద్రంలో బీఎస్‌ఎఫ్ గ్రూప్ సెంటర్ ఏర్పాటు కోసం ఐదెకరాల స్థలాన్ని, మానకొండూర్ మండలంలోని వెల్ది గ్రామం వద్ద సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటి ఫోర్స్) గ్రూప్ సెంటర్ కోసం నాలుగెరకాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే ఈ మూడు మండలాల్లో గ్రూప్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. కేంద్రం ప్రతిపాదనల మేరకు కలెక్టర్ సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించింది. మంత్రి వర్గ సమావేశం ఆయా స్థలాలను అసోం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ గ్రూప్ సెంటర్లకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది.
గంగాధర డిగ్రీ కళాశాలకు 29 పోస్టులు
గంగాధర మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే నిర్ణయించింది. ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు వీలుగా బోధనా సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని నియమించడానికి వీలుగా రాష్ట్ర కేబినెట్ 29 పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ కళాశాలలో 20 మంది బోధన సిబ్బందిని, ఆరుగురు బోధనేతర (క్లారికల్) పోస్టులను, మరో మూడు ఔట్ సోర్సింగ్ పోస్టులను రాష్ట్ర కెబినెట్ మంజూరీ చేసింది. ఈ సంవత్సరం నుంచే ఈ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తీసుకుని తరగతులు ప్రారంభించనున్నారు.
భూమి కేటాయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
కరీంనగర్‌లో కేంద్ర బలగాల గ్రూప్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ గత మార్చి నెలలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. అసోం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాల గ్రూప్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవల సంబంధిత విభాగాల డీజీపీలతో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే గ్రూప్ సెంటర్‌ల ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించ వచ్చని డీజీపీలు పేర్కొన్నారు. తగిన స్థలంఒ కేటాయించాలని కోరుతూ మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర మంత్రి లేఖకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది. కలెక్టర్‌కు పంపిన ప్రతిపాదనలను సీసీఎల్‌ఏకు పంపించారు. ఆయా ప్రతిపాదలను రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తు వెల్దిలో నాలుగు ఎకరాలు, చొప్పదండి రుక్మాపూర్‌లో ఐదు ఎకరాలు, గన్నేరువరంలో ఐదు ఎకరాలు మొత్తం 14 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానించింది.