ముగిసిన సీసీఐ పత్తి కొనుగోళ్లు..
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:07 AM
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రా లను శనివారం వరకే కొనుగోలు చేపట్టి ఆదివారం నుంచి మూసివేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఇండ్ల వద్ద పత్తి నిల్వలు ఉండటంతో పాటు చేనులలో కూడా ఇంకా పత్తి ఏరాల్సి ఉన్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కేంద్రా లను శనివారం వరకే కొనుగోలు చేపట్టి ఆదివారం నుంచి మూసివేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఇండ్ల వద్ద పత్తి నిల్వలు ఉండటంతో పాటు చేనులలో కూడా ఇంకా పత్తి ఏరాల్సి ఉన్నది. కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ముందస్తుగానే కేం ద్రాలను మూసి వేస్తుండడంతో రైతులకు మద్దతు ధరలు దక్కే అవకాశాలు లేకుండా పోతాయని ఆందో ళన వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే మార్కెట్లలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు 6500 రూపాయల నుంచి 7500 రూపాయలకు మించి ధర చెల్లించలేదు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నామ్ ద్వారా పత్తి కొనుగోలు చేపడుతున్నప్పటికీ రైతులకు మద్దతు ధరలు తగ్గడం లేదు.
2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి లాంగ్ స్టేబుల్ ధర 8110 రూపా యలు, మీడియం స్టేబుల్ ధర 7710 రూపాయలుగా నిర్ణయించింది. కానీ జిల్లాలో ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర చెల్లించలేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సీసీఐ కేంద్రాల ద్వారా 1,45,500 క్వింటాళ్లు, ప్రైవేట్‌గా వ్యాపారులు 1,27,000 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. జిల్లాలో గడిచిన వానాకాలం సీజన్‌లో 49,783 ఎకరాలలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఒక్కో ఎకరానికి సగటున ఎనిమిది క్వింటాళ్ల చొప్పున సుమారు నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులు 2,72,500 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. జిల్లాకు చెందిన కొందరు రైతులు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, జమ్మికుంట మార్కెట్లలో కొంత మేరకు విక్రయించారు. ఎకరం పత్తి సాగు చేస్తే కనీసం 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈసారి సగటున 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతు న్నారు. తమ వద్ద నిలువలు ఉండడంతో పాటు చేన్లలో ఇంకా పత్తి ఏరాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలను నిలిపివేయడం వల్ల మద్దతు ధరలు అందకుండా పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 15 వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టాలి
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోళ్లను మార్చి 15వ తేదీ వరకు కొనుగోలు చేయా లని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి జిల్లాలో రైతుల వద్ద పత్తి పంట నిల్వలు ఉన్నాయని, ఇంకా చేన్లలో ఏరాల్సిన పత్తి ఉందని, సీసీఐ కొనుగోలు కేంద్రాలను మార్చి 15వ తేదీ వరకు కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ సైతం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీని కలిసి తెలంగాణలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలును మార్చి 15వ తేదీ వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీసీఐ కేంద్రాల ద్వారా మార్చి 15వ తేదీ వరకు కొనుగోళ్లు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.