Share News

గురుకులాల్లో సదుపాయాలపై శ్రద్ధ తీసుకోవాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:47 AM

గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్‌ వీక్‌ సందర్భంగా కలెక్టర్‌ పెద్దపల్లిలో గల మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల విద్యాలయాన్ని సందర్శించారు.

గురుకులాల్లో సదుపాయాలపై శ్రద్ధ తీసుకోవాలి

పెద్దపల్లి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్‌ వీక్‌ సందర్భంగా కలెక్టర్‌ పెద్దపల్లిలో గల మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలని, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థ్థులు ఆరోగ్యంగా ఉండేందుకు నాణ్యత ప్రమాణాలు పాటించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతగా ఉండాలని, పోషకాహార ప్రమాణాలను పాటిస్తూ సరైన డైట్‌ను అమలు చేయాలని సూచించారు. ఆహార భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వంట ప్రక్రియలో శుభ్రత, నాణ్యతపై రాజీ పడకూడదన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్‌ పతకాలు ప్రదానం చేశారు. డీఎస్‌ఓ శ్రీనాథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:47 AM