కాలువ నీరు.. వరినాట్ల జోరు..
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:46 PM
యాసంగిలో సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా యాసంగిలోనూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. కాలువ చివరలో ఉన్న కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ పరిధిలోని పొలాలకు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లిటౌన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా యాసంగిలోనూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. కాలువ చివరలో ఉన్న కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ పరిధిలోని పొలాలకు అందుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో యాసంగి సీజన్‌లో 2.40 లక్షల ఎకరాలు సాగవుతాయని అంచనా వేశారు. అందులో వరి 2.8 లక్షలు, మొక్కజొన్న 18.940, ఇతర 12.497 ఎకరాలుగా వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ డి 83, 86 కాలువల ద్వారా పంటలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాలువల్లో పేరుకపోయిన చెత్తాచెదారం తొలగించారు. యాసంగికి ఎస్సారెస్పీ కాలువల ద్వారా వారబందీ పద్ధతిలో నీళ్లు విడుదల చేస్తున్నారు, ఎమ్మెల్యే విజయరమణారావు సాగునీటిపై దృష్టిపెట్టారు. ఎస్సారెస్పీ నీటి ప్రాధాన్యం గుర్తించి అధికారులతో చర్చలు జరిపి కాలువల మరమ్మతులు చేయించారు. దీంతో యాసంగిలోనూ దిగుబడులు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
బోర్లతో పాటు ఎస్సారెస్పీ నీరు.
జిల్లాలో రైతులు యాసంగి సాగును బోర్లతోపాటు ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఎస్సారెస్పీ నీరు క్రమం తప్పకుండా వదులుతుండటంతో భూగర్భ జలాలు అనుకూలంగా ఉన్నాయి. దీంతో రైతులు బోర్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఎండాకాలంలో భూగర్భజలాలు తగ్గిపోయే అవకాశం ఉండటంతో బోర్లు కూడా నీరు అందించలేని పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో రైతులు ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడక తప్పదు. ఎస్సారెస్పీ అధికారులు నీటిని వదులుతుండటంతో పొలాలకు నీరు పారడమే కాకుండా స్థానికంగా ఉన్న కుంటలు, చెరువులు కూడా నిండుతున్నాయి. దీంతో భూగర్బ జలాలు తగ్గడం లేదు. రైతులు కాలువ నీళ్లతో పాటు బోర్లను ఉపయోగిస్తున్నారు. కొన్ని చోట్ల నాట్లు వేయగా మరికొని నారు ఎదుగుతుండడంతో పొలాలను సాగుకు సిద్ధం చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకు
జిల్లాలో ఎస్సారెస్సీ టేలెండ్ భూములు మంథని, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో దాదాపు 20 వేల ఎకరాల్లో ఉన్నాయి. రెండేళ్లుగా ఎస్సారెస్పీ నీరు అందుతుండడంతో సాగు చేరస్తున్నారు. ఎస్సారెస్సీ నీటిని సక్రమంగా రిలీజ్ చేసినట్లయితే చివరి ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందని కాలువలను శుభ్రం చేయించారు. వారబంధీని సక్రమంగా నిర్వహించడంతో రైతులు యాసంగిలో మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. అయితే శాశ్వతంగా పరిష్కరించేందుకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మించాలని ఎమ్మెల్యే పట్టుదలతో ఉన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేయాలని ప్రసంగించారు.
గత యాసంగిలో 3లక్షల 8 వేల మెట్రిక్ టన్నులు
గత ఏడాది యాసంగిలో 2.02 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయగా అకాల వర్షాలు కురిసినప్పటికి 3లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ యాసంగిలో దానిని అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండేళ్ళ క్రితం 2.06 ఎకరాలు వరి సాగు చేసినప్పటికి కేవలం 3 లక్షల పైచీలుకు పంట చేతికి వచ్చేది. చివరి ఆయకట్టు సాగు నీరందక పంటలు ఎండిపోయేవి. సాగునీరు వస్తుండడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు.
అన్నదాతలు బిజీబిజీ..
సుల్తానాబాద్, (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న డీ 86 ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమవడంతో మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. కాలువల్లో నీరు ప్రవహించడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. వరిసాగుకు అనుకూల పరిస్థితులు ఉండటంతో రైతులు వరి నాట్ల నిమగ్నమయ్యారు. మండలంలో సుమారు 25 వేల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరుగుతుండగా, ఇందులో అధికభాగం కాలువ నీటి ఆధారంగానే సాగవుతోంది. గతంలో యాసంగిపంటల సాగుకు నీటికొరత భయంతో పలువురు రైతులు భూముల చివరి వరకు సాగు చేయలేని పరిస్థితి ఉంది. కాలువ నీరు పొలాలకు చేరడంతో రైతులు భూములు సిద్దం చేసి, నాట్ల పనులను వేగవంతం చేశారు. ఒకవైపు కాలువల్లో నీరు పరుగులు తీస్తుండగా, మరోవైపు పొలాల్లో నాట్ల సందడి మండలానికి పచ్చని శోభను తెచ్చింది. కాలువనీరు సమయానికి విడుదల కావడంతో పంటపై ధైర్యం వచ్చిందని, చివరి ఎకరం వరకు భూమి ఖాళీగా ఉంచకుండా సాగు చేస్తున్నామని పలువురు రైతులు పేర్కొన్నారు.