బై బై గణేశా..
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:47 AM
విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా.. గణేష్ మహారాజ్‌కి జై.. అంటూ భక్తుల నీరాజనాలు మార్మోగాయి. ఉదయం నుంచి తెల్లవారులు బొజ్జ గణపయ్య శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా.. గణేష్ మహారాజ్‌కి జై.. అంటూ భక్తుల నీరాజనాలు మార్మోగాయి. ఉదయం నుంచి తెల్లవారులు బొజ్జ గణపయ్య శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భక్తుల జయజయఽధ్వానాల మధ్య వినాయక నిమజ్జనోత్సవం సాగింది. కోలాటాలు, నృత్యాలు, వాయిద్యాల దరువుల మధ్య మహిళలు, పురుషులు, చిన్నారుల ప్రదర్శనతో శోభాయాత్ర సాగింది. శుక్రవారం ఉదయం నుంచి ఇళ్లలో వినాయకులను ప్రతిష్టించుకున్న వారు ముందుగా సిరిసిల్ల మానేరు వాగు వద్ద ప్రత్యేక పూజలు చేసి వినాయకులను సాగనంపారు. మధ్యాహ్నం నుంచి మొదలైన భారీ విగ్రహాల శోభాయాత్రలు డీజే సౌండ్ల మధ్య హోరెత్తింది. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద నిమజ్జనానికి తరలివచ్చే వినాయకులకు హిందూ ఉత్సవ సమితి స్వాగతించారు. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో మానేరు వాగు బ్రిడ్జి వద్ద భారీ క్రేన్‌లతో వినాయకులను నిమజ్జనం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు చిన్నపెద్ద విగ్రహాలు ఐదు వేలకు పైగా ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 800భారీ విగ్రహాలను, చిన్న సైజు విగ్రహాల మండపాలకు కొదవ లేదు. ఏర్పాట్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతేలతో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, కమిషనర్ ఖధీర్‌పాషా పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, 300 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. మండపాల వద్ద వినాయకుని పూజలందుకున్న లడ్డూలకు డిమాండ్ పెరిగింది. వేలం పాటల్లో లడ్డూను దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు.
జయహో మట్టి గణపతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు మట్టి గణపతిలపై ఆసక్తి చూపారు. వినాయక చతుర్థి రోజున ఇళ్లలో జరుపుకునే పూజలకు మట్టి వినాయకులను ఎక్కువగా ప్రతిష్టించారు. 12 రోజులపాటు ఘనంగా జరుపుకునే ఉత్సవాలకు కూడా భారీ స్థాయిలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని లేబర్ అడ్డా వద్ద రామ్‌భగీచ నిర్వాహకులు 25 ఫీట్ల భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. ఆక్కడే భక్తుల జలాభిషేకాలతో నిమజ్జనం చేయడం విశేషం. నిమజ్జనం తర్వాత వినాయకుడి మట్టిని భక్తులు తీసుకెళ్లారు. సిరిసిల్లలో రామలాల్ మండపం నిర్వాహకులు 2016 వెండి చిన్న గణపతి విగ్రహాల సమహారంతో భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. నాందేడ్‌కు చెందిన కళాకారులు తయారుచేసిన సిల్వర్ గణపతి అందరినీ ఆకట్టుకుంది. విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. బీవైనగర్‌లో భారీ సెట్టింగ్‌లో వేసిన విగ్రహాలు అలరించాయి.