దసరా నాటికి బస్‌డిపో ప్రారంభం
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:07 AM
పెద్దపల్లి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఆర్టీసీ బస్ డిపోను దసరా నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కరీంనగర్ ఆర్‌ఎం రాజుతో కలిసి బస్ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు.
పెద్దపల్లి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఆర్టీసీ బస్ డిపోను దసరా నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కరీంనగర్ ఆర్‌ఎం రాజుతో కలిసి బస్ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 11 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బస్‌డిపోకు ప్రభుత్వం 4.31 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, దసరా నాటికి పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. డిపో ప్రారంభంతో జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: విజయరమణారావు
పెద్దపల్లి ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇక్కడ బస్ డిపో ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇతర రెవెన్యూ డివిజన్లలో బస్ డిపోలు ఉన్నప్పటికీ, రెవెన్యూ డివిజన్ అయిన పెద్దపల్లిలో డిపో లేకపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేయగా, ప్రజల ఆకాంక్షను గుర్తించి 2024 డిసెంబర్‌లో బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. దసరా నాటికి డిపో నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని డిపో మేనేజర్ కవిత, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్ మొలుగూరి కమల్, ఆర్టీసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.