పంటలకు ఊపిరి
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:50 AM
ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 40 రోజులపాటు వర్షాలే కురవలేదు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇటీవల కురిసిన వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 40 రోజులపాటు వర్షాలే కురవలేదు. ఈ పరిస్థితుల్లో వర్షాలు కురవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
ప్రాజెక్టుల్లోకి చేరుతున్న నీరు
జిల్లా సాగుకు ప్రధాన జలవనరు అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 40 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మరింత వరద వచ్చే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రానికి 40.861 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మహారాష్ట్ర వరద అందితే రెండుమూడురోజుల్లోనే ప్రాజెక్టులు నిండినా ఆశ్చర్యం లేదని గత అనుభవాలు చెబుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.175 టీఎంసీలకుగాను 16.387 టీఎంసీల నీరు ఉన్నది. దీనికి క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 3,543 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 12,600 క్యూసెక్కుల నీరును మిడ్‌మానేరుకు పంపిస్తున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 27.55 టీఎంసీలకు 20.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం 13,819 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఐదు వేల క్యూసెక్కులను ఎల్‌ఎండీకి వదులుతున్నారు. ఎల్‌ఎండీలో 24 టీఎంసీలకుగాను 6 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. దీంతో ఖరీఫ్‌సాగుకు బెంగ లేదని రైతులు ధీమాగా ఉన్నారు.
వరి నాట్లు ముమ్మరం
జిల్లాలో ఈసీజన్‌లో 2.79 లక్షల ఎకరాల్లో వరి, 48 వేల ఎకరాల్లో పత్తి, 4,800 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని, కూరగాయలు, ఇతర పంటలు మరో 15వేల ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేశారు. వర్షాలు పెరుగడం, జలవనరుల్లోకి నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లావ్యాప్తంగా రైతులు నాట్లు వేయడం ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 2,26,424 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. మరో 53 వేల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉన్నది. 45,250 ఎకరాల్లో పత్తి, 4,459 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. వర్షాభావ పరిస్థితులతో 22,672 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 21,726 ఎకరాల్లో సాగు చేశారు. 4.058 ఎకరాల్లో పెసర, 2,201 ఎకరాల్లో కందులు, 2221 ఎకరాల్లో కూరగాయలు, 5,154 ఎకరాల్లో మొక్కజొన్న, 7,218 ఎకరాల్లో ఇతర పంటలు, 360 ఎకరాల్లో జొన్నలు సాగు చేశారు. వారంరోజుల్లోగా మిగతా విస్తీర్ణంలోనూ వరి నాట్లు పడే అవకాశాలు ఉన్నాయి.