Share News

ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేయండి

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:09 AM

మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేస్తే ఎక్కువ అమ్మకాలు జరుగడంతోపాటు మంచి ధర లభిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం రంగంపల్లిలో ఏర్పాటు చేసి వీ హబ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేయండి

పెద్దపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 14 (ఆంఽధ్రజ్యోతి) మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్‌ చేస్తే ఎక్కువ అమ్మకాలు జరుగడంతోపాటు మంచి ధర లభిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం రంగంపల్లిలో ఏర్పాటు చేసి వీ హబ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. మహిళలు తయారు చేసే ఏ ఉత్పత్తులైన వీ హబ్‌ ద్వారా మంచి బ్రాండింగ్‌ చేసే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టీ ఫైబర్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ కనెక్షన్లు గ్రామ పంచాయతీల వరకు చేరినట్లు త్వరలో ఇండ్లకు కనెక్షన్‌ ఇస్తామని పేర్కొన్నారు. రోబోటెక్‌, ఏఐ వంటి ప్యూచర్స్‌ అందుబాటులోకి వస్తాయన్నారు. చదివిన చదువుకు అనుగణంగా పరిశ్రమలు ఉండక పోవడం వల్ల టాస్క్‌ సెంటర్ల ద్వారా శిక్షణ ఇచ్చి దారి చూపుతున్నట్లు తెలిపారు.

మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలు తీసుకువస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు వీ హబ్‌ ద్వారా మంచి డిమాండ్‌ ఉంటుందని, అధిక లాభాలు వస్తాయన్నారు. గత ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వాస్పత్రి పని తీరు చాలా బాగుందని, నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చినట్లు వివరించారు. ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌లు కేటాయించాలని మంత్రిని కోరారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ రామగుండంలో వీహబ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం యువ వేదిక, టీఫైబర్‌ సమ్మర్‌ క్యాంపు పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వీ హబ్‌ పని తీరును వివరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ నూగిళ్ళ మల్లయ్య, అంతటి అన్నయ్య గౌడ్‌, సీఈవో సీత, వేణు ప్రసాద్‌, కౌన్సిలర్లతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:09 AM