భూ భారతి నిర్లక్ష్యంపై కొరడా
ABN , Publish Date - Aug 29 , 2026 | 01:06 AM
భూభారతి అమలు, భూ రికార్డుల ప్రక్షాళన, రీ సర్వే తదితర అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో రెవెన్యూ శాఖలో కలవరం మొదలైంది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలో పర్యటించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, భూ రీ సర్వే, 22-ఏ కేసులు, భూ భారతి దరఖాస్తులు, అసైన్డ్ భూముల సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
జగిత్యాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): భూభారతి అమలు, భూ రికార్డుల ప్రక్షాళన, రీ సర్వే తదితర అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో రెవెన్యూ శాఖలో కలవరం మొదలైంది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలో పర్యటించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, భూ రీ సర్వే, 22-ఏ కేసులు, భూ భారతి దరఖాస్తులు, అసైన్డ్ భూముల సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. పనుల్లో జాప్యం, నిర్లక్ష్యంపై మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఫకలెక్టర్ ప్రత్యేక దృష్టి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నేపథ్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ భూభారతి, భూ రికార్డుల పరిశీలన, రీ సర్వే, ఇందిరమ్మ గృహ నిర్మాణాల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారం రోజులుగా రెవెన్యూ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మండలాల వారీగా పురోగతిని తెలుసుకుంటూ, పెండింగ్ వ్యవహారాలపై అధికారులను ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యం కనిపిస్తే అక్కడికక్కడే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యతలను గుర్తు చేస్తున్నారు.
ఫచర్యలతో అధికారుల్లో కలవరం...
పనితీరులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులపై జిల్లా యంత్రాంగం వరుసగా చర్యలు తీసుకుంటుండడంతో సంబంధిత వర్గాల్లో కలవరం మొదలైంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో మెట్‌పల్లి తహసీల్దార్ నీతాను సస్పెండ్ చేశారు. మరో తహసీల్దార్‌కు మెమో జారీ కాగా.. ఇంకో తహసీల్దార్‌పై ఇంక్రిమెంట్ కోత విధించినట్లు సమాచారం. తహసీల్దార్ స్థాయి అధికారులపైనే చర్యలు కొనసాగు తుండడంతో కింది స్థాయి రెవెన్యూ సిబ్బందిలోనూ అప్రమత్తత నెలకొంది. భూభారతి కింద వచ్చే దరఖాస్తులు, భూ సమస్యలు, రికార్డుల పరిశీలన, రీ సర్వే తదితర అంశాలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు తనిఖీలు చేపడుతున్నారు. గ్రామాల వారీగా, మండలాల వారీగా పురోగతిని బేరీజు వేసి వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఫభూ భారతి దరఖాస్తులు..
జిల్లా వ్యాప్తంగా 61,767 భూ భారతి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 35,819 దరఖాస్తులు ఆమోదించగా, 15,805 దరఖాస్తులు తిరస్కరించారు. 1,249 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలోని 20 గ్రామాల్లో 2,732.01 ఎకరాల భూమిని రీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఇందులో 3,474.30 ఎకరాల భూమిని రీ సర్వే చేశారు. మిగిలిన భూమి రీ సర్వే పనులు నడుస్తున్నాయి.
ఫరెవెన్యూ సదస్సుల దరఖాస్తులు..
జిల్లాలో రెవెన్యూ సదస్సుల్లో 38,822 సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 886 సర్వే నంబర్ల దరఖాస్తులను ఆమోదించగా, 18,021 సర్వే నంబర్ల దరఖాస్తులను తిరస్కరించారు. 19,915 సర్వే నంబర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిదంగా జిల్లాలో 35,267 సాదా బైనామా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 35,260 దరఖాస్తులకు క్షేత్ర స్థాయి విచారణ పూర్తి చేశారు. 25,103 దరఖాస్తులు పరిష్కరించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
-సత్యప్రసాద్, కలెక్టర్
జిల్లాలో భూ రీ సర్వే, భూ భారతి, ఇందిరమ్మ గృహ నిర్మాణాలు తదితర పనులు మరింత వేగవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాము. విధి నిర్వహణలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. పారదర్శకంగా, నిర్ణీత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.