Share News

మెరుగైన ఉపాధి

ABN , Publish Date - Oct 11 , 2026 | 01:03 AM

ఎల్‌నినో తీవ్రత ఉపాధి కూలీలపై పడకూడదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింత పనులను కల్పించాలని తీసుకున్న నిర్ణయం ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాల్నిస్తోంది. వికసిత భారత గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ ఆండ్‌ అజీవికా మిషన (గ్రామీణ్‌)- వీబీ జీ రామ్‌ జీ చట్టం కింద ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో పనులు పెంచాలని ఇటీవల గ్రామసభలు నిర్వహించి కొత్త పనులకు శ్రీకారం చుట్టారు.

మెరుగైన ఉపాధి

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

ఎల్‌నినో తీవ్రత ఉపాధి కూలీలపై పడకూడదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింత పనులను కల్పించాలని తీసుకున్న నిర్ణయం ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాల్నిస్తోంది. వికసిత భారత గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ ఆండ్‌ అజీవికా మిషన (గ్రామీణ్‌)- వీబీ జీ రామ్‌ జీ చట్టం కింద ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో పనులు పెంచాలని ఇటీవల గ్రామసభలు నిర్వహించి కొత్త పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన పని ప్రదేశాలకు కూలీలను తరలించేందుకు ఉపాధి హామీ సిబ్బంది క్షేత్రస్థాయిలో జోరుగా శ్రమిస్తున్నారు. కచ్చితంగా ఇంత మంది ఈరోజు పనికి వెళ్లాలని నిర్ణయించుకున్న టార్గెట్‌ ప్రకారం వారికి ఉపాధి అందిస్తున్నారు. వికసిత గ్రామపంచాయతీ ప్రణాళిక(వీజీపీపీ)లో భాగంగా గత నెలలో జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు సిబ్బందికి నిర్వహించి కూలీల పెంపు లక్ష్యాన్ని గ్రామాల వారీగా నిర్దేశించారు.

రోజురోజుకు పెరుగుతూ..

అక్టోబరు 2న ఉమ్మడి జిల్లాలో 29,465మంది పనికి వచ్చారు. 3 నాటికి ఆసంఖ్య 34,184కు పెరిగింది. 5న పనిప్రదేశాలకు వచ్చే కూలీల సంఖ్య 35,184కి చేరింది. 6న నాలుగు జిల్లాల పరిధిలో ఏకంగా 41,364కు వీరి సంఖ్య నమోదైంది. జూలై మొదటి వారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 15వేల మంది మాత్రమే పని చేయగా.. ఇప్పుడు కొత్తగా గుర్తించిన పనుల వల్ల సగటున 38వేలమంది పని పొందుతున్నారు. ఈ నెల7న 38,930, 8వ తేదీన 38,313మంది కూలీలొచ్చారు.

రెండు నెలల వ్యత్యాసమిలా..(పని దొరికిన వారు)

------------------------------------------------------------

ఆగస్ట్‌ సెప్టెంబరు

-----------------------------------------------------------

జిల్లా కుటుంబాలు కూలీలు కుటుంబాలు కూలీలు

----------------------------------------------------------

జగిత్యాల 13,884 16,661 26,270 31.326

కరీంనగర్‌ 11,796 14,647 16,543 19,980

పెద్దపల్లి 10,688 13,205 18,885 23,625

సిరిసిల్ల 15,292 19,922 23,444 30,866

-----------------------------------------------------------

మొత్తం 51,660 64,435 85,142 1,05,797

------------------------------------------------------------

ప్రయోజనమిలా..

- అక్టోబరులో లక్షన్నర మంది కూలీలకు రోజు పని అందే విధంగా పర్యవేక్షణ పెంచుతున్నారు.

- ఈ అక్టోబరు నుంచి మార్చిలోగా ఎక్కువ మందికి కూలీ లభిస్తే కాంపొనెంట్‌ నిధులు మరిన్ని వస్తాయి.

- పెద్ద పంచాయతీల్లో వంద మందికి పనిని కల్పించాలని నిర్ణయించగా పల్లెల్లో 50 మంది లక్ష్యంగా పెట్టారు.

- కొత్త టార్గెట్‌ ప్రకారం జిల్లా, మండలాల వారీగా అధికారులంతా రోజూవారీ అటెండెన్సను చూస్తున్నారు.

- కొత్తగా గ్రామాల్లో జాబ్‌కార్డులను అందిస్తున్నారు. 125 రోజుల పనిని వీలైనంత ఎక్కువ మందికి కల్పిస్తారు.

- ఎక్కడ పని విషయంలో గ్యాప్‌ ఏర్పడిందో గుర్తించి అక్కడ పనులను కొత్తవి కొనసాగేలా చూస్తున్నారు.

పెరిగిన ఫీల్డ్‌ విజిట్‌లు..

ఎంపీడీవో సహా జిల్లాస్థాయి అధికారులు ఉపాధిహామీ పనులను పక్కాగా పరిశీలించాలని రాష్ట్రస్థాయి అధికారులనుంచి అందిన ఆదేశాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఫీల్డ్‌ విజిట్‌లు పెరిగాయి. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎనఎంఎంఎస్‌) యాప్‌ ద్వారా పని ప్రదేశంలో కూలీల ఫొటోలతో అటెండెన్స పక్కాగా నమోదు చేస్తున్నారు. నెట్‌వర్క్‌ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు జియో ట్యాగ్‌, టైమ్‌ స్టాంప్‌ను అప్‌లోడ్‌ చేస్తున్నారు. మస్టర్‌ రోల్స్‌, దినసరి కూలీల లెక్కలను తనిఖీ సిబ్బంది గమనిస్తున్నారు. చెరువులు, కుంటలకు అనుబంధంగా ఉన్న కాలువల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వకోసం కుంటల తవ్వకాలు, వ్యవసాయానుబంధ పనులను కొత్తగా గుర్తించారు. వీటి వద్దకు వచ్చే కూలీల్లో పనికి రాని వారి గురించి వాకాబు చేస్తున్నారు. ఊళ్లో ఉన్న జాబ్‌కార్డులలో ఎవరెవరు ఎందుకు రావట్లేదనే వివరాల్ని ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. మొత్తంగా ఎల్‌నినో ప్రభావంతో కరవు ఛాయలు మున్ముందు దరిచేరుతాయనే ఉద్దేశంతో ఉపాధి హామీ కూలీలకు ఇప్పటి నుంచే పని కల్పనతో ఆర్థిక భరోసానిలా రోజుకూలితో అందిస్తున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 01:03 AM