Share News

వెనుక’బడి’..!

ABN , Publish Date - Oct 04 , 2026 | 01:05 AM

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌.. ఇది సమీప భవిష్యత్తులో పేదల విద్యాప్రగతిని మార్చే పాఠశాల. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్‌ను ఏర్పాటు చేసి అన్నివర్గాల పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, కార్పొరేట్‌ తరహాలో వసతి, బోధనను అందించాలని నిర్ణయించింది.

వెనుక’బడి’..!

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌.. ఇది సమీప భవిష్యత్తులో పేదల విద్యాప్రగతిని మార్చే పాఠశాల. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్‌ను ఏర్పాటు చేసి అన్నివర్గాల పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన, కార్పొరేట్‌ తరహాలో వసతి, బోధనను అందించాలని నిర్ణయించింది. ఇదే క్యాంపస్‌లో క్రీడలు, ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఒకే చోట దాదాపుగా 2500 మంది డిజిటల్‌ సాంకేతికతతో చదువుకోవచ్చు. ఈ పాఠశాలల ఏర్పాటుకు జిల్లాలో పూర్తి స్థాయిలో మోక్షం లభించడం లేదు. నియోజకవర్గానికి ఓ యంగ్‌ ఇండియా పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మాత్రం రెండు నియోజకవర్గాలకే పాఠశాలలు పరిమితమయ్యాయి. ఇప్పటి వరకు మానకొండూర్‌, చొప్పదండి నియోజరవర్గాలకే ఇవి మంజూరు కాగా.. కరీంనగర్‌, హుజూరాబాద్‌లకు ఎప్పుడు మంజూరూ చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. అంచనాలు రూపొందించి.. పలు చోట్ల స్థలాలను గుర్తించినప్పటికీ రాష్ట్ర సర్కారు మలివిడతలో వీటి ఏర్పాటుకు అవసరమైన జీవోను జారీ చేస్తుందనే ఆకాంక్షను జిల్లా అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

కనిపిస్తున్న పురోగతి..

- మానకొండూర్‌ నియోజకవర్గంలో తిమ్మాపూర్‌ మండలం యాదవులపల్లి వద్ద నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌( వైఐఐఆర్‌ఎస్‌) భవన నిర్మాణ పనులు కొన్ని నెలలుగా చకచకా నడుస్తున్నాయి. 2024 అక్టోబరు 11న రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 28 స్కూళ్లకు భూమి పూజ చేయగా.. అదే రోజున ఇక్కడ శంకుస్థాపన చేశారు. మొదట్లో 150 కోట్ల వరకు అంచనా వ్యయంతో పనులు ప్రారంభమైనా తర్వాత పెరిగిన నిర్మాణ వ్యయానికి అనుగుణంగా 2025 మార్చి 9న 200 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పాలనాపరమైన అనుమతులు వచ్చాక 2025 జూలై 11న టెండర్‌ నిర్వహణకు నోటిపికేషన జారీ చేశారు. తర్వాత పనులను ప్రారంభించగా ఇప్పుడు ఇక్కడ చేపడుతున్న కొన్ని భవనాలు రెండో అంతస్తు నిర్మా దశలో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నాటికి సిద్ధం చేసే దిశగా జోరుని పెంచుతున్నారు.

- చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ చూపించి రుక్మాపూర్‌లో 200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్‌ ఇండియా స్కూల్‌ను మంజూరు చేయించుకున్నారు. 2025 నవంబరు 24న ఇక్కడ భూమి పూజ చేపట్టారు. 16 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. పునాదులు దాటి ఫిల్లర్ల స్థాయిలో నిర్మాణాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ పనుల్లో వేగాన్ని మరింతగా పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్‌తోపాటు అధికారులు ప్రత్యేకమైన దృష్టిని సారిస్తున్నారు. వందల సంఖ్యలో గదులను ఇక్కడ నిర్మించాల్సి ఉండడం వల్ల నిర్మాణపరంగా జాప్యం జరిగే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జూన వరకు నిర్ణీత వ్యవధిగా నిర్ణయుంచినా.. ఆలోపు పూర్తవడమనేది కష్టసాధ్యమైన ప్రక్రియగానే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా సహకారం అందితే నిర్ణీత గడువుకు ఇది పూర్తయ్యే వీలుంది.

ఆ నియోజకవర్గాల్లో అంచనాల్లోనే..

కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాలో యంగ్‌ ఇండియా పాఠశాల ఏర్పాటులో మరింత జాప్యం జరుగుతుందనేది స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు మంజూరు చేసి టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించినా వచ్చే ఏడాదిలో విద్యాబోధనకు అనుగుణంగా నిర్మితమవడం అనేది కష్టం. ఈ రెండు నియోజకవర్గాల్లో 15 నుంచి 20 ఎకరాల్లో పాఠశాలల ఏర్పాటుకు అనువైన స్థలం ఎంపిక అనేది అధికారులకు సమస్యగా మారింది. ఒకే గ్రామంలో ఈ స్థలం ఉండాలనే నిబంధనకు తోడుగా అందరికీ అనువైన చోట ఏర్పాటు చేయాలనే విషయంలో అధికారులు, నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చాలాచోట్ల అవసరమైన మేర స్థలం లేకపోవడంతో ఆలస్యమైంది. వచ్చే విద్యాసంవత్సరం లోపు ఈ యంగ్‌ ఇండియా పాఠశాలలు మంజూరు చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Oct 04 , 2026 | 01:05 AM